బాంబులకే తండ్రిలాంటి బాంబు!
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:18 AM
ప్రపంచంలో అన్ని బాంబులకు తండ్రి లాంటి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ను సిద్ధం చేశామని.. ఆ సరికొత్త ఆయుధంతో శత్రువులకు షాక్ ఇస్తామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది.
కొత్త ఆయుధంతో శత్రువులకు షాక్ ఇస్తాం
త్వరలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు
గత ఏడాది ఇజ్రాయెల్‌తో యుద్ధం నాటితో పోలిస్తే క్షిపణి నిల్వలు పెరిగాయి: ఐఆర్‌జీసీ
ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ప్రయోగానికి అమెరికా సిద్ధమైందన్న వార్తలకు కౌంటర్
టెహ్రాన్, అక్టోబరు 21: ప్రపంచంలో అన్ని బాంబులకు తండ్రి లాంటి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ను సిద్ధం చేశామని.. ఆ సరికొత్త ఆయుధంతో శత్రువులకు షాక్ ఇస్తామని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. దానిని త్వరలోనే ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొంది. ఇరాన్‌లో అణు స్థావరాలు, కీలక రక్షణ, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ను ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఐఆర్‌జీసీ ప్రకటన ఆసక్తి రేపుతోంది. ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి హోసేన్ మెహెబ్బీ ఈ ప్రకటన చేశారు. 2025 జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం నాటితో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ వద్ద క్షిపణుల నిల్వలు ఒకటిన్న రెట్లు పెరిగాయని తెలిపారు. తాము ఆవిష్కరించనున్న ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’తో శత్రువులకు గట్టి షాక్ తప్పదని పేర్కొన్నారు. అయితే ఆ బాంబు ఏమిటి, ఏ తరహాది అన్న ప్రస్తావనేదీ చేయలేదు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు పరిష్కారం ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేయాలని ఇరాన్ ప్రయత్నించిందని, దాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుందని చెప్పారు. అయినా ఇరాన్ ఇంకా నిలబడిందని, ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే దీనికి పరిష్కారమని పేర్కొన్నారు.