Share News

క్షిపణి మోతలు.. డ్రోన్‌ దాడులు

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:13 AM

పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పర్షియన్‌ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

క్షిపణి మోతలు.. డ్రోన్‌ దాడులు

  • ఇరాన్‌, అమెరికా మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం

  • శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి పరస్పర దాడులు

దుబాయి, జూన్‌ 27: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పర్షియన్‌ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోర్ముజ్‌లో ఇరాన్‌ సూచించిన మార్గంలో కాకుండా.. నౌకలు ఒమన్‌ తీరం వెంట రాకపోకలు సాగిస్తుండటంతో వాటిపై గత గురువారం నుంచి ఇరాన్‌ దాడులు చేస్తోంది. అమెరికా హెచ్చరించినప్పటికీ వినకపోవటంతో అగ్రరాజ్యం శనివారం ఎదురుదాడి చేసింది. దీంతో పరస్పరం దాడులు కొనసాగాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ లాంచ్‌పాడ్లను, రాడార్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ శనివారం ప్రకటించింది. ఈ దాడులతో ఆగ్రహించిన ఇరాన్‌.. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్‌ దాడులు చేసింది. తమపైకి ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిందని.. వాటిని అడ్డుకొని కూల్చేశామని బహ్రెయిన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. శనివారం కూడా ఒక కార్గో నౌకపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసినట్లు అమెరికా నేవీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, సుదీర్ఘ సైనిక ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్‌-లెబనాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ దేశం నుంచి హెజ్బొల్లాను లెబనాన్‌ తరిమేయాలి. లెబనాన్‌లో ఆక్రమించిన భూభాగాల నుంచి ఇజ్రాయెల్‌ క్రమంగా వైదొలగాలి.

Updated Date - Jun 28 , 2026 | 04:13 AM