హోర్ముజ్ నుంచి భారత నౌకలు వెళ్లొచ్చు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:43 AM
యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా జరక్కుండా హోర్ముజ్ జలసంధిని బిగబట్టిన ఇరాన్.. భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, ఇరాక్ సహా తన మిత్రదేశాల నౌకలను ఆ దారిలో అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.
చైనా, రష్యా, పాక్, ఇరాక్ దేశాలవి కూడా!
మిత్ర దేశాల నౌకలకు అనుమతిస్తున్నాం
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ వెల్లడి
టెహ్రాన్, మార్చి 26: యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా జరక్కుండా హోర్ముజ్ జలసంధిని బిగబట్టిన ఇరాన్.. భారత్, చైనా, పాకిస్థాన్, రష్యా, ఇరాక్ సహా తన మిత్రదేశాల నౌకలను ఆ దారిలో అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. పాశ్చాత్య మీడియా చెబుతున్నట్టుగా ఆ జలసంధిని తాము పూర్తిగా మూసివేయలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘హోర్ముజ్ గుండా తమ నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూడాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేశాయి. వాటిలో మా మిత్రదేశాల నౌకలకు, మరికొన్ని ఇతర కారణాల వల్ల మేము నిర్ణయించుకున్న సందర్భాల్లో కొన్ని నౌకలకు మా సాయుధ దళాలు రక్షణ కల్పించాయి. భారత్‌కు చెందిన రెండు నౌకలు కొన్నిరోజుల క్రితం సురక్షితంగా ఈ మార్గాన్ని దాటాయి. ఒక బంగ్లాదేశ్ నౌక కూడా.. ఈ దేశాలన్నీ (చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్, ఇండియా) మాతో మాట్లాడాయి. మాతో సమన్వయం చేసుకున్నాయి. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. యుద్ధం తర్వాత కూడా..’’ అని ఆయన వివరించారు. అదే సమయంలో.. శత్రుదేశాలు, ఈ యుద్ధంలో పాలుపంచుకుంటున్న దేశాల నౌకలను మాత్రం హోర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతించం. అమెరికా, ఇజ్రాయెల్, ఈ సంక్షోభంలో పాత్ర పోషిస్తున్న కొన్ని గల్ఫ్ దేశాల నౌకలకు క్లియరెన్స్ ఇవ్వబోం. మేం యుద్ధంలో ఉన్నాం. ఇది యుద్ధక్షేత్రం. మా శత్రుదేశ నౌకలను, వారి మిత్రదేశాల నౌకలను అనుమతించడానికి ఎలాంటి కారణమూ లేదు. మిగతావారికి మాత్రం ఇది తెరిచే ఉంటుంది’’ అని అరాఘ్చీ స్పష్టం చేశారు.