చర్చలు జరుపుదామంటూ..భూతల దాడులకు ట్రంప్ ప్లాన్: ఇరాన్ స్పీకర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:19 AM
యుద్ధం విరమణ కోసం ఓ వైపు చర్చలు జరుపుదామంటూనే.. మరోవైపు ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలీబఫ్ మండిపడ్డారు.
న్యూఢిల్లీ, మార్చి 29: యుద్ధం విరమణ కోసం ఓ వైపు చర్చలు జరుపుదామంటూనే.. మరోవైపు ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఘలీబఫ్ మండిపడ్డారు. అమెరికా బలగాలు భూతల దాడులకు దిగితే.. వారిని మట్టుపెట్టేందుకు ఇరాన్ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ‘‘ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టింది. ఎఫ్-35 సహా కీలక విమానాలు, విమాన వాహక యుద్ధ నౌకలు దెబ్బతిన్నాయి. చమురు మార్కెట్లు నియంత్రణ తప్పాయి. హోర్ముజ్‌ను తెరిచేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో చర్చలకు సిద్ధమని బయటికి చెబుతూనే.. రహస్యంగా భూతల దాడులకు ప్లాన్ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. అమెరికా యాంఫిబియస్ రెడీ గ్రూపు సహా మూడు యుద్ధ నౌకలు, 3,500 మంది సైనికులు పశ్చిమాసియాకు చేరుకోవడం, మరో 10 వేల మందిని తరలించేందుకు సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఘలీబఫ్ ఈ హెచ్చరికలు చేశారు. కాగా, ఇరాన్‌లో పౌర మౌలిక సదుపాయాలు, స్కూళ్లు, ఆస్పత్రులపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని.. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మండిపడ్డారు. లెబనాన్‌లో ముగ్గురు జర్నలిస్టులను ఇజ్రాయెల్ కావాలనే దాడి చేసి చంపిందని ఆరోపించారు.