Share News

‘పప్పు’లో కాలేసిన అమెరికా!

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:28 AM

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై అమెరికా పప్పులో కాలేసింది. భారత్‌ సుంకాలు సున్నాకు తగ్గించే అమెరికన్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొన్ని పప్పుధాన్యాలు కూడా ఉన్నాయంటూ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించుకుంది...

‘పప్పు’లో కాలేసిన అమెరికా!

  • అమెరికా పప్పులపై సుంకాలను భారత్‌సున్నాకు తగ్గిస్తుందన్న అంశంపై వెనక్కి..

వాషింగ్టన్‌/ న్యూయార్క్‌, ఫిబ్రవరి 11: భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై అమెరికా పప్పులో కాలేసింది. భారత్‌ సుంకాలు సున్నాకు తగ్గించే అమెరికన్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొన్ని పప్పుధాన్యాలు కూడా ఉన్నాయంటూ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌ను సవరించుకుంది. అంతేకాదు గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ టెక్‌ సంస్థలు భారత్‌లో పొందే ఆదాయంపై వేస్తున్న డిజిటల్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ను కూడా భారత్‌ తొలగిస్తుందన్న అంశాన్నీ వెనక్కి తీసుకుంది. అంతే కాకుండా రూ.45 లక్షల కోట్ల(500 బిలియన్‌ డాలర్ల) అమెరికా ఉత్పత్తులను కచ్చితంగా దిగుమతి చేసుకుంటామని భారత్‌ మాటిచ్చిందన్న అంశాన్నీ మార్చి.. ఈ మేరకు దిగుమతులు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని భారత్‌ హామీ ఇచ్చిందని చేర్చింది. ఈ మేరకు సవరించిన ఫ్యాక్ట్‌షీట్‌ను విడుదల చేసింది. మరోవైపు, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే), చైనా ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపుతూ పెట్టిన మ్యాప్‌ను అమెరికా వాణిజ్య విభాగం (యూఎ్‌సటీఆర్‌) తొలగించింది. సాధారణంగా అమెరికా తమ మ్యాప్‌లలో పీఓకే, ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాల హద్దులను చుక్కల లైన్‌తో విడిగా చూపేది. కానీ వారం క్రితం భారత్‌తో వాణిజ్య ఒప్పందంలోని అంశాలను వివరిస్తూ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టులో పీఓకే, ఆక్సాయ్‌చిన్‌ పూర్తిగా భారత్‌లోనే ఉన్నట్టుగా చూపింది.

Updated Date - Feb 12 , 2026 | 03:28 AM