యూకేను వీడుతున్న వారిలో భారతీయులే అధికం
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:51 AM
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వలసవచ్చే వారి బదులు తిరిగి వెళ్లే వారి సంఖ్య అధికమవుతోంది. తిరిగివెళ్లేవారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉండగా..
లండన్, నవంబరు 26: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వలసవచ్చే వారి బదులు తిరిగి వెళ్లే వారి సంఖ్య అధికమవుతోంది. తిరిగివెళ్లేవారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉండగా, చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. గురువారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్-ఓఎన్‌ఎస్) విడుదల చేసిన అధికారిక లెక్కల్లో ఈ విషయం వెల్లడయింది. ఈ ఏడాది జూన్‌లో ముగిసిన ఏడాది కాలంలో మొత్తం 85వేల మంది భారతీయులు తిరిగి వెళ్లారు. వీరిలో 55వేల మంది స్టడీ వీసాపై వచ్చినవారు, 28వేల మంది వర్క్ వీసాపై వచ్చినవారు, 2వేల మంది ఇతర వీసాలపై వచ్చిన వారు ఉన్నారు. ఇదే కాలంలో 51వేల మంది చైనీయులు తిరిగి వెళ్లారు. మరోవైపు యూకేకు వెళ్లున్నవారి సంఖ్యలోనూ తగ్గుముఖం కనిపిస్తోంది. ఇదే సమయంలో 77వేల మంది స్టడీ వీసా మీద, 40వేల మంది వర్క్ వీసా మీద వెళ్లారు. ఈ విషయంలోనూ భారతీయులు అగ్రస్థానంలో ఉండడం గమనార్హం.