యూఎస్‌కు భారతీయ విద్యార్థులు నో
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:27 AM
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారతీయ విద్యార్థులు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యారు
75ు పడిపోయిన చేరికలు
వీసా తిరస్కరణలు, స్లాట్ల కొరత, తీవ్ర ఆంక్షలే కారణం
న్యూఢిల్లీ, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత భారతీయ విద్యార్థులు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యారు. యూఎస్ కళాశాలల్లో భారతీయ విద్యార్థుల నమోదు 75ు పడిపోయింది. వలసలపై ట్రంప్ చేస్తున్న తీవ్ర విమర్శలు, పెరుగుతున్న వీసా తిరస్కరణలు, విధిస్తున్న పలు తీవ్ర ఆంక్షలు అమెరికాలోని మొదటి 40 విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే విద్యార్థులు వెనకడుగు వేయడానికి కారణమయ్యాయి. వర్సిటీల్లో చేరే మొత్తం విద్యార్థుల్లో 70ు మంది శరదృతువులోనే(ఆగస్టు-అక్టోబరు ఫాల్) చేరతారు. ఇది గత ఏడాది దారుణంగా దెబ్బతింది. వీసా స్లాట్లు దొరక్కపోవడంతో చాలా మంది విద్యార్థులు యూఎస్ వెళ్లాలన్న తమ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్ అరవింద్ మండువ మాట్లాడుతూ, ‘కొన్ని దశాబ్దాల తరువాత ఈ దుస్థితిని చూశాం. చాలా మంది విద్యార్థులు పరిస్థితి చక్కబడే వరకూ వేచిచూసే ధోరణితో తమ ప్రణాళికలను జనవరి-మార్చి నాటికి వాయిదా వేశారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడం, నెలల తరబడి ఎదురుచూసినా ఇంటర్వ్యూ స్లాట్లు దొరక్కపోవడంతో విద్యార్థులు నిరాశకు లోనయ్యారు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల సామాజిక మాధ్యమాల ఖాతాలను లోతుగా పరిశీలించాలన్న ట్రంప్ నిర్ణయం అక్కడ వారిని మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. డిసెంబరు, 2025 నాటికి 8,000 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసిన ప్రభుత్వం వారిని వారాల వ్యవధిలో దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించిందని అధికారిక డేటా పేర్కొంది.