Drug trafficking: కువైత్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ఇద్దరు భారతీయులకు మరణశిక్ష
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:15 AM
పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతున్న ఇద్దరు భారతీయులకు కువైత్ కోర్టు మరణ శిక్ష విధించింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద పద్నాలుగు కిలోల హెరాయిన్.....
వారి నుంచి 14 కిలోల హెరాయిన్,8 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం
అమెరికాలో 140 కిలోల కొకైన్ రవాణాచేస్తూ దొరికిన ఇద్దరు భారతీయులు
దాని విలువ దాదాపు 62 కోట్లని అంచనా
న్యూయార్క్, కువైత్, జనవరి 8: పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతున్న ఇద్దరు భారతీయులకు కువైత్ కోర్టు మరణ శిక్ష విధించింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద పద్నాలుగు కిలోల హెరాయిన్, ఎనిమిది కిలోల మెథాంఫెటమైన్ లభ్యమైంది. ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిద్దరూ అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమని నిరూపించడంతో న్యాయమూర్తి వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మరోవైపు, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో.. పెద్ద ఎత్తున కొకైన్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు భారతీయ ట్రక్ డ్రైవర్లు పోలీసుల హైవే తనిఖీలో అడ్డంగా దొరికిపోయారు. వారి పేర్లు.. గురుప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30). వారి వాహనాన్ని ఆపినప్పుడు.. మాదకద్రవ్యాలను పసిగట్టే శునకాలు అందులోని స్లీపర్‌బెర్త్ (డ్రైవర్లు విశ్రాంతి తీసుకునే చోటు)లో డ్రగ్స్ ఉన్నట్టు పసిగట్టాయని, సోదా చేయగా దాదాపు 140 కిలోల కొకైన్ దొరికిందని.. అది దాదాపు లక్షా పదమూడు వేల మంది ప్రాణాలు తీయగలిగేంత ప్రమాదకర పరిమాణమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. వారిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారిపై మాదకద్రవ్యాల రవాణా కేసు పెట్టామని ఇండియానా పోలీసులు తెలిపారు. వారివద్ద స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపుగా రూ.62 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీరిలో గురుప్రీత్ సింగ్ 2017లో, జస్వీర్ సింగ్ 2023లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించామని.. ఈ నేపథ్యంలో వారిపై డీపోర్టేషన్ హోల్డ్‌లు కూడా పెట్టామని వెల్లడించారు. డీపోర్టేషన్ హోల్డ్ అంటే.. వీరు ఈ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పజెప్తారు. వారు ఈ ఇద్దరినీ భారతదేశానికి డీపోర్ట్ చేస్తారు. కాగా.. ట్రక్కులో ఉన్న మాదక ద్రవ్యాల గురించి తమకు తెలియదని, ఆ ట్రక్కును రిచ్‌మాండ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాల్సిందిగా ట్రకింగ్ కంపెనీ చెప్తే తీసుకెళ్తున్నామని.. తాము అమాయకులమని వారిద్దరూ వాదిస్తున్నారు.