Share News

ఇరాన్‌లో ఉన్న భారతీయులంతా వెంటనే వచ్చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:11 AM

ఇరాన్‌లో విద్యార్థులు మళ్లీ ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులంతా వెంటనే తిరిగి ఇండియాకు వచ్చేయాలని భారత ప్రభుత్వం సూచించింది.

ఇరాన్‌లో ఉన్న భారతీయులంతా వెంటనే వచ్చేయాలి

  • తాజా నిరసనలతో కేంద్రం సూచన

  • 10వేల మందికిపైగా ఉన్నట్లు అంచనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఇరాన్‌లో విద్యార్థులు మళ్లీ ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులంతా వెంటనే తిరిగి ఇండియాకు వచ్చేయాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న అంచనాలను ప్రస్తావించింది. ఈ మేరకు ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు వెళ్లవద్దని కోరింది. భారతప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరాన్‌లో 10వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, టూరిస్టులు, ఉపాధి కోసం వెళ్లినవారు ఉన్నారు. ఇరాన్‌లో ఇటీవల జరిగిన దేశవ్యాప్త ఆందోళనలను ఆ దేశ ప్రభుత్వం అత్యంత పాశవికంగా అణచివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో అణుబాంబును తయారు చేయడానికి పనికివచ్చేలా యురేనియాన్ని ఇరాన్‌ ఇప్పటికే శుద్ధి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ అన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్‌ మధ్య అణు చర్చలు జరుగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యురేయాన్ని ఆయుధాలు చేయడానికి అనుగుణంగా శుద్ధి చేసి సిద్ధంగా పెట్టుకున్నందునే ఇరాన్‌ అణు చర్చల్లో మొండిగా వ్యవహరిస్తోందని విట్కాఫ్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 04:11 AM