Share News

రష్యాతో రహస్య డీల్‌?

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:19 AM

ఐదో తరం యుద్ధవిమానాలైన ఎస్‌యు-57లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్‌ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుందా? తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాల్ని చూస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది.

రష్యాతో రహస్య డీల్‌?

  • ఎస్‌యు-57 విమానాల కొనుగోలుకు సీక్రెట్‌గా ఒప్పందం?

(సెంట్రల్‌ డెస్క్‌)

ఐదో తరం యుద్ధవిమానాలైన ఎస్‌యు-57లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్‌ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుందా? తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాల్ని చూస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. ఎస్‌యు-57 స్టెల్త్‌ విమానాల అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్‌బోరోన్‌ఎక్స్‌పోర్ట్‌ సీఈవో అలెగ్జాండర్‌ మిఖయేవ్‌ ఇటీవల వెల్లడించారు. అయితే, ఆ దేశాల పేర్లేమిటో ఆయన చెప్పలేదు. కానీ.. భారత్‌, రష్యాల మధ్య ఎస్‌యు-57 కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్టు ఇటీవలే మిలటరీ వాచ్‌ మేగజైన్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. భారత వాయుసేన యుద్ధవిమానాల కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో.. ఫ్రాన్స్‌ నుంచి 114 రఫేల్‌ విమానాల (4.5 జనరేషన్‌) కొనుగోలుకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అయితే, ఈ విమానాల సోర్స్‌ కోడ్‌ను భారత్‌తో పంచుకునేందుకు ఫ్రాన్స్‌ విముఖంగా ఉంది. బ్రహ్మోస్‌, అస్త్ర, రుద్రం క్షిపణులను రఫేల్‌తో అనుసంధానం చేయడానికి అవసరమైన మేరకైనా కోడ్‌ను తమకు అందించాలని భారత్‌ కోరుతుండగా.. కనీసం దానిక్కూడా ఫ్రాన్స్‌ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా భారత్‌కు ఈ విమానాల సరఫరా ప్రారంభం కావాలంటే మరో నాలుగేళ్లు పడుతుంది. మరోవైపు భారత్‌ వాయుసేన అమ్ములపొదిలో ఐదోతరం స్టెల్త్‌ విమానం లేకపోవడం పెద్ద లోటుగా మారింది. రఫేల్‌ విమానాలు 4.5 తరానివి కావడంతో అవి కొన్నా ఆ లోటు పూర్తిగా తీరదు. ఈ నేపథ్యంలో భారత్‌ ఐదో తరం యుద్ధవిమానాల కోసం చూస్తోంది. భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం స్టెల్త్‌ విమానం ఆమ్కా 2035 తర్వాత గానీ అందుబాటులోకి రాదు. అమెరికాకు చెందిన ఎఫ్‌-35 విమానాల్ని భారత్‌కు విక్రయించేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏడాదిన్నర కిందట ప్రకటించారుగానీ.. వాటి కొనుగోలుకు మన వాయుసేన సుముఖంగా లేదు.


ఎందుకంటే అమెరికా వాటి సోర్స్‌ కోడ్‌ను మనతో ఎంతమాత్రం పంచుకోదు సరికదా.. వాటి వినియోగంపై చాలా షరతులు పెడుతుంది. కానీ, రష్యా మాత్రం ఎస్‌యు-57 పూర్తి సోర్స్‌కోడ్‌ను భారత్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పెద్ద సంఖ్యలో వాటిని కొంటామంటే.. భారత్‌లోనే వాటిని తయారుచేసేందుకు కూడా సహకరిస్తామని చెప్పింది. ప్రస్తుతం మహరాష్ట్రలోని నాసిక్‌లో రష్యన్‌ ఎస్‌యు-30ఎంకేఐ యుద్ధవిమానాల్ని భారత్‌ తయారుచేస్తోంది. ఆ యూనిట్‌లోనే ఎస్‌యు-57లను కూడా తయారుచేయవచ్చని, రెండు విమానాల్లో కొన్ని విడిభాగాలు ఉమ్మడిగా ఉన్నాయని రష్యా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఎస్‌యు-57లను కొనేందుకు భారత్‌ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒకవేళ భారత్‌ గనక వాటిని కొనుగోలు చేస్తే స్వదేశీ క్షిపణులతోపాటు దేశీయంగా రూపొందించిన విరూపాక్ష రేడార్‌ను కూడా దాంతో అనుసంధానం చేయొచ్చు. ఈ కారణంగానే భారత్‌ రహస్య ఒప్పందం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, బహిరంగంగా దీన్ని ప్రకటిస్తే అమెరికా నుంచి సమస్యలు రావొచ్చనే కారణంతోనే రహస్యంగా ఉంచినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Apr 27 , 2026 | 04:19 AM