అమెరికా పప్పులు ఉడుకుతున్నాయ్!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:07 AM
వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్టు వెల్లడైంది...
అగ్రరాజ్యం పప్పుధాన్యాలపై భారత్‌లో ‘జీరో’ ట్యాక్స్!
అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైనా..
కొన్నింటిపై మాత్రం సుంకాలు తగ్గింపు
గూగుల్, అమెజాన్ తదితర ఐటీ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ సర్వీసెస్ పన్ను రద్దు
వాణిజ్య ఒప్పందంపై వైట్‌హౌస్ ‘ఫ్యాక్ట్ షీట్’
వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్టు వెల్లడైంది. వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా విడుదల చేసిన ‘వాస్తవాల పత్రం (ఫ్యాక్ట్ షీట్)’లో ఈ విషయం పేర్కొంది. ఈ నెల 6న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ పప్పు ధాన్యాల అంశం లేకపోవడం గమనార్హం. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ‘అమెరికా-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం’ పేరిట ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. ‘‘అమెరికాకు చెందిన దాదాపు అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైనా భారత్ సుంకాలను తొలగిస్తుంది. కొన్నింటిపై సుంకాలను తగ్గిస్తుంది. డిస్టిలరీల్లో వినియోగానంతరం మిగిలే ధాన్యాల పిప్పి (డీడీజీ), ఎర్ర జొన్నలు, బాదం, జీడిపప్పు వంటి ట్రీనట్స్, కొన్ని రకాల పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, ఆల్కహాల్‌తోపాటు కొన్ని రకాల పప్పులు, ఇతర ఉత్పత్తులపైనా సుంకాలను సున్నాకు తగ్గిస్తుంది’’ అని అందులో పేర్కొంది. వాణిజ్య ఒప్పందం సంయుక్త ప్రకటనలో పప్పుల అంశం లేకున్నా... దిగుమతి సుంకాలు తగ్గించే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో పప్పు ధాన్యాలు కూడా ఉంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారమే సంకేతాలు ఇచ్చారు. యూపీయే ప్రభుత్వ హయాం నుంచీ బాదాం, పిస్తా, వాల్‌నట్స్, పప్పు ధాన్యాలు వంటి మనకు అవసరమైన ఉత్పత్తులపై దిగుమతి సుంకాల మినహాయింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. నిజానికి భారత్ ఇటీవల పప్పు ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం పెరిగింది. 2024-25లో మొత్తం రూ.50 వేల కోట్ల (5.5 బిలియన్ డాలర్ల) పప్పులను దిగుమతి చేసుకోగా.. అందులో అమెరికా నుంచి వచ్చినవి రూ.812 కోట్లు (89.7 మిలియన్ డాలర్లు) మాత్రమే. భారత్ ఎక్కువగా కెనడా, ఆస్ట్రేలియా నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది.
డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ తొలగింపు హామీ..
వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌ను తొలగిస్తుందని వైట్‌హౌజ్ ఫ్యాక్ట్ షీట్‌లో పేర్కొంది. డిజిటల్ వాణిజ్యానికి అవరోధంగా ఉన్న అంశాలపై చర్చించి.. ఈ అంశంపై ద్వైపాక్షిక నిబంధనల రూపకల్పనకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. ఎలకా్ట్రనిక్ ట్రాన్స్‌మిషన్స్‌ను కస్టమ్స్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయించే నిబంధనలు కూడా అందులో ఉంటాయని వెల్లడించింది. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు అమెరికా కేంద్రంగానే పనిచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సర్వీసులు అందిస్తుంటాయి. ఆన్‌లైన్‌లో ప్రకటనల ద్వారా అన్ని దేశాల నుంచి భారీగా ఆదాయం పొందుతుంటాయి. కానీ ఆయా దేశాలకు ఆ ఆదాయంపై పన్ను చెల్లించవు. భారత్, యూకే వంటి దేశాల్లో మాత్రం డిజిటల్ సర్వీస్ పన్ను అమల్లో ఉంది. మన దేశం ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయంపై 2శాతం పన్ను విధిస్తోంది. దాన్ని తొలగించాలని గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ పన్నును తొలగిస్తామని భారత్ హామీ ఇచ్చిందని వైట్‌హౌజ్ ఫ్యాక్ట్ షీట్‌లో పేర్కొన్నారు.
టారి్‌ఫలు సున్నా చేస్తే అమెరికా గెలిచేది..
టీ20 క్రికెట్ ప్రపంచక్‌పలో భాగంగా అమెరికా (యూఎ్‌సఏ)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ సరదా వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై సుంకాలను అమెరికా సున్నాకు తగ్గించి ఉంటే. టీ20 మ్యాచ్‌లో అమెరికా గెలిచి ఉండేదన్నారు. అమెరికా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిందని అభినందించారు.