Share News

Diplomatic Warning: ఇరాన్‌ను వెంటనే వీడండి

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:41 AM

ఇరాన్‌లో ఆందోళనలు ఉధృతమవడం, అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. వెంటనే వెనక్కి వచ్చేయాలని భారత్‌ సహా పలుదేశాలు ఇరాన్‌లోని తమ పౌరులను హెచ్చరించాయి.

Diplomatic Warning: ఇరాన్‌ను వెంటనే వీడండి

  • వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు భారత్‌ సహా పలు దేశాల హెచ్చరికలు

  • ఉద్రిక్తతల నివారణకు రంగంలోకి ఖతార్‌.. ఇరాన్‌తో చర్చలు

న్యూఢిల్లీ/దోహా, జనవరి 14: ఇరాన్‌లో ఆందోళనలు ఉధృతమవడం, అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. వెంటనే వెనక్కి వచ్చేయాలని భారత్‌ సహా పలుదేశాలు ఇరాన్‌లోని తమ పౌరులను హెచ్చరించాయి. ‘‘ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, భారత సంతతి అప్రమత్తంగా ఉండాలి. నిరసనలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి. స్థానిక పరిస్థితులను మీడియా ద్వారా గమనిస్తూ ఉండాలి. అందుబాటులో ఉన్న ఏదో ఒక ప్రయాణ మార్గంలో వెంటనే ఇరాన్‌ను వీడాలి. భారత దౌత్యకార్యాలయంతో టచ్‌లో ఉండాలి’’ అని ఇరాన్‌లోని భారత ఎంబసీ సూచించింది. ఇక భారతీయులెవరూ కూడా ప్రస్తుతం ఇరాన్‌కు వెళ్లకపోవడం మంచిదని భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు కెనడా, ఆస్ట్రేలియా సహా మరికొన్ని దేశాలు కూడా తమ పౌరులు వెంటనే ఇరాన్‌ను వీడాలని, కొత్తగా ఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు తమ పౌరులు, విద్యార్థులు సరిహద్దుల ద్వారా స్వదేశంలోకి తిరిగి వస్తున్నారని పాకిస్థాన్‌ ప్రకటించింది.


కాస్తంత మానవత్వం చూపండి: ట్రంప్‌

ఇరాన్‌లో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం జాతీయ భద్రతా బృందంతో సమీక్షించారు. ఆందోళనకారుల పట్ల ఇరాన్‌ దారుణంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రభుత్వం సొంత పౌరులపై కాస్తంతైనా మానవత్వం చూపాలన్నారు. కాగా, ఇరాన్‌లో దాడులు చేసేందుకు 50 కీలక మిలిటరీ, రక్షణ స్థావరాలను అమెరికాకు చెందిన ‘యునైటెడ్‌ ఎగైనెస్ట్‌ న్యూక్లియర్‌ ఇరాన్‌’ గ్రూపు గుర్తించినట్టు డైలీమెయిల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ట్రంప్‌ సమీక్షకు ముందే ఆ జాబితాను, వివరాలను వైట్‌హౌజ్‌కు పంపిందని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లో మృతుల సంఖ్య 2,571కిపైగానే ఉందని అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అందులో 2,403 మంది ఆందోళనకారులేనని, 147 మంది భద్రతా దళాల సిబ్బంది అని పేర్కొంది. ఆందోళనలతో సంబంధంలేని పౌరులు, పిల్లలు మరో 21 మంది మరణించినట్టు తెలిపింది. ప్రభుత్వం 18వేల మంది ఆందోళనకారులను అరెస్టు చేసిందని పేర్కొంది.

ఇరాన్‌తో ఖతార్‌ చర్చలు!

ఇరాన్‌లో ఆందోళనలు, సైనిక చర్యకు సిద్ధమని అమెరికా ప్రకటించడం నేపథ్యంలో మరోసారి మధ్యవర్తిత్వానికి ఖతార్‌ సిద్ధమైంది. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పరస్పర దాడులకు దిగినప్పుడు.. ఖతార్‌ మధ్యవర్తిత్వం, అమెరికా జోక్యంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తాజాగా ఇరాన్‌లో పరిణామాలు ఉద్రిక్తతలు రేపుతుండటంతో.. ఆ దేశ అధికారులతో ఖతార్‌ చర్చలు మొదలుపెట్టింది. ఇరాన్‌ అత్యున్నత భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజని, ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అల్‌ థానీ ఫోన్‌లో చర్చలు జరిపారు. మరోవైపు అమెరికా, ఇరాన్‌ ఇరుదేశాలూ తమ మధ్య దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు బుధవారం ప్రకటించాయి.


మస్క్‌ ‘స్టార్‌ లింక్‌’ ఇంటర్నెట్‌ ఒక్కటే దిక్కు!

ఇరాన్‌లో ప్రభుత్వం ఇంటర్నెట్‌, మొబైల్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో.. అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇరాన్‌లో ఏం జరుగుతోందన్నది తెలియకుండా పోయింది. ఈ క్రమంలో ఆందోళనకారులు రహస్యంగా ఇరాన్‌లోకి తీసుకెళ్లిన ఎలాన్‌ మస్క్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సంస్థ ‘స్టార్‌ లింక్‌’ కిట్లు కీలకంగా మారాయి. వాటి సాయంతోనే కొంతవరకు సమాచారం, వీడియోలు బయటికి వస్తున్నాయి. ఇరాన్‌లోని స్టార్‌లింక్‌ కిట్లకు ఆ సంస్థ ఉచితంగా సర్వీసు అందిస్తోందని అమెరికాలోని యాక్టివిస్టు మెహ్దీ యహ్యనెజాద్‌ బుధవారం వెల్లడించారు. మరోవైపు స్టార్‌లింక్‌ కిట్లను గుర్తించి, స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్‌ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మంగళవారమే కొన్ని కిట్లను పట్టుకుంది.

అమెరికా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇరాన్‌ ఏర్పాట్లు

తమపై అమెరికా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇరాన్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇరాన్‌ భద్రతా దళం ‘ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌’ పూర్తి సంసిద్ధతతో ఉన్నట్టు మంగళవారమే ప్రకటించింది. జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం అనంతరం భారీ స్థాయిలో క్షిపణులను సిద్ధం చేసుకున్నామని వైమానిక దళం కమాండర్‌ మాజిద్‌ మౌసావి పేర్కొన్నట్టు రాయిటర్స్‌ వార్తాసంస్థ బుధవారం వెల్లడించింది. మరోవైపు తమపై దాడి చేస్తే.. సమీపంలోని సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఖతార్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్‌ రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికా తమపై దాడికి దిగకుండా అడ్డుకునేలా ఆయా దేశాలపై ఇరాన్‌ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - Jan 15 , 2026 | 04:42 AM