త్వరలో భారత్‌తో ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:10 AM
చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధంగా ఉన్నాయని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.
దాంతో 200 కోట్ల జనాభాతో కూడిన మార్కెట్ ఆవిర్భావం
27న భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సు
అక్కడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రకటన
న్యూఢిల్లీ, జనవరి20: చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధంగా ఉన్నాయని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు. ఈ ఒప్పందంతో ఏకంగా 200 కోట్ల జనాభాతో కూడిన భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగోవంతుకు సమానమన్నారు. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి వంటి భారీ ఒప్పందమని ఆమె అభివర్ణించారు. మంగళవారం దావో్‌సలో ప్రపంచ ఆర్థిక సదస్సులో లెయెన్ ప్రసంగించారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే భారత గణతంత్ర ఉత్సవాలకు యూరోపియన్ కౌన్సెల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, తాను ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సంగతిని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీతో తాము చర్చలు జరుపుతామన్నారు. ‘నేను భారత్‌కు వెళ్తాను. అక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. భారత్‌తో కుదిరే చరిత్రాత్మక ఒప్పందం వల్ల ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖండంతో యూర్‌పకు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. నేటి అభివృద్ధి కేంద్రాలతో, ఈ శతాబ్దపు ఆర్థికశక్తులతో వ్యాపారం చేయాలని యూరప్ ఆశిస్తోంది. లాటిన్ అమెరికా నుంచి ఇండో పసిఫిక్ వరకూ.. ప్రపంచాన్ని యూరప్ ఎంచుకుంటుంది. యూర్‌పను ఎంచుకోవటానికి ప్రపంచం సిద్ధంగా ఉంది’ అని లెయెన్ పేర్కొన్నారు.
భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిఈయూ
2023-24 ఆర్థిక సంవత్సరంలో 13,500 కోట్ల డాలర్ల వాణిజ్యంతో ఈయూ.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నమోదైంది. త్వరలో కుదిరే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ద్వారా ఇరుపక్షాల వాణిజ్య బంధం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల ప్రభావం భారత్‌పాటు 27 దేశాల కూటమి అయిన ఈయూ మీద తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 27న జరిగే భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతోపాటు 15,000 కోట్ల యూరోల విలువైన ‘యూరప్ సెక్యూరిటీ యాక్షన్’ (ఈయూ దేశాల సమగ్ర రక్షణ విధానం)లో భారతీయ సంస్థలు పాల్గొనే అవకాశంపైనా ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు రక్షణ రంగంలోనూ భారత్-ఈయూ ఒప్పందం దిశగా అడుగులు పడవచ్చని తెలుస్తోంది. 2026-2030 కాలవ్యవధికి సంబంధించి ఇరుపక్షాల బంధానికి మార్గనిర్దేశం చేసే సమగ్ర వ్యూహాత్మక సంయుక్త కార్యాచరణపైనా ఒప్పందం కుదరవచ్చని సమాచారం. వాస్తవానికి 2007లోనే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా ఈయూ-భారత్ మధ్య చర్యలు ప్రారంభమయ్యాయి. ఆశించిన స్థాయిలో అవి ముందుకు వెళ్లకపోవటంతో 2013లో నిలిచిపోయాయి. 2022లో చర్చలు పునఃప్రారంభమై.. ప్రస్తుతం తుది అంకానికి చేరుకున్నాయి.