Reverse Brain Drain: ఇక రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్!
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:58 AM
అమెరికా నుంచి స్వదేశీనికి తిరిగొస్తున్న భారతీయ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత..
అమెరికా నుంచి తిరిగొస్తున్న భారతీయ నిపుణులు
న్యూఢిల్లీ, జనవరి 10: అమెరికా నుంచి స్వదేశీనికి తిరిగొస్తున్న భారతీయ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న కఠిన వలస విధానాలతో పాటు వీసా ప్రాసెసింగ్‌లో అనిశ్చితి, లేఆ్‌ఫలు, సోషల్ ఖాతాల వెట్టింగ్ తదితర కారణాలతో వీరు తిరుగుముఖం పడుతున్నారని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీన్ని రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ విధంగా వస్తున్న వారిలో అత్యధిక శాతం టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కాగా, వస్తువులు, సేవల రంగాలకు చెందిన సీనియర్, మధ్యస్థాయి అధికారులు కూడా గతంతో పోలిస్తే పెద్దసంఖ్యలో ఉంటున్నారు. వీరిలో పలువురు హెచ్-1బీ, ఎల్-1 వీసాలు కలిగి ఉన్నవారేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో ఏడాదికి 1,50,000 డాలర్ల నుంచి 4లక్షల డాలర్ల వరకూ జీతాలు సంపాదించేవారు. వీసాల విషయంలో పెరిగిన అనిశ్చితి, వలస విధానాల్లో తరచూ మార్పులు చేయడం వంటి చర్యల కారణంగా అమెరికాలో దీర్ఘకాలిక కెరీర్ కోసం ప్రణాళికలు వేసుకోవడం కష్టతరం చేసిందని నియామక రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ రంగానికి చెందిన డజనుకు పైగా సీఈవోలు గతేడాది భారత్‌కు తిరిగి వచ్చేశారు.