అమెరికా వీడండి.. లేదంటే ఉద్యోగం మానేయండి
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:44 AM
అమెరికాలో తన విదేశీ ఉద్యోగులకు ఐబీఎం షాకిచ్చింది. ఇకపై తన కన్సల్టింగ్ విభాగంలో హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు ఆ టెక్ దిగ్గజం ప్రకటించింది.
విదేశీ ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చిన ఐబీఎం
హెచ్1బీ, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లు నిలిపివేత
నిర్ణయం తెలపడానికి 3 వారాల గడువు
డిసెంబరు 31 చివరి వర్కింగ్ డేగా ప్రకటన
వేలాది మంది భారతీయులపై ప్రభావం
న్యూఢిల్లీ, నవంబరు 26: అమెరికాలో తన విదేశీ ఉద్యోగులకు ఐబీఎం షాకిచ్చింది. ఇకపై తన కన్సల్టింగ్ విభాగంలో హెచ్1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు ఆ టెక్ దిగ్గజం ప్రకటించింది. ఈ విభాగంలో 1.50 లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. తమ నిర్ణయ ప్రభావం పడే ఉద్యోగులకు ఐబీఎం రెండు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించింది. వీరు వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి పనిచేయవచ్చు. లేదంటే వచ్చే నెలాఖరులోగా ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇప్పటికే ఐబీఎం తన ఉద్యోగులకు సూచించింది. నిర్ణయం తెలపడానికి వారికి 3 వారాల సమయం ఇచ్చింది. వేరే దేశంలో పనిచేయడానికి అంగీకరించని వారికి 3 నెలల జీతాన్ని పరిహారంగా ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిసింది. డిసెంబరు 31 వీరి చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది. అయితే ఎంతమంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.. ఎంత మంది అమెరికాలో ఉండి పనిచేయవచ్చు అనే విషయాన్ని ఐబీఎం బహిర్గతం చేయలేదు. అమెరికా వర్క్ వీసాలు, గ్రీన్‌కార్డుల కోసం విదేశీ నిపుణులు సాధారణంగా తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీ సహాయం మీదే ఆధారపడతారు. టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఇప్పుడు ఐబీఎం నిర్ణయంతో అనిశ్చితిలో పడిపోయారు.
తమ నిర్ణయంపై ఐబీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. గతంలో నైపుణ్యం గల వర్కర్ల లభ్యత అమెరికాలో తక్కువగా ఉండటం వల్ల వీసా కార్యక్రమాలను వాడుకున్నామని, ఇప్పుడు అమెరికాలో నిపుణుల లభ్యత పెరిగిందని చెప్పారు. అలాగే తమ వ్యాపార అవసరాల్లో మార్పులు కూడా వచ్చాయన్నారు. అయితే ట్రంప్ సర్కార్ ఆంక్షలు కూడా దీనికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వీసా సెలెక్షన్లలో మార్పులు, కొత్త హెచ్1బీకి లక్ష డాలర్ల ఫీజు ప్రతిపాదన, ఉద్యోగ ఆధార వలస విధానం అమలు చేస్తున్న తీరుపై తనిఖీలు కూడా ప్రభావం చూపాయని చెబుతున్నారు. అయితే ఐబీఎంలోనే ఉంటూ విదేశాల్లో పనిచేయడానికి అంగీకరించిన వారికి భారత్ మంచి గమ్యస్థానంగా పేర్కొంటున్నారు. ఈనెల 19న ఐబీఎం కెరీర్ పోర్టల్‌లో ప్రచురించిన జాబితా ప్రకారం ఆ కంపెనీకి ఇతర దేశాల్లో ఉన్న శాఖల్లో 1,278 ఖాళీలు ఉన్నట్లు ప్రపంచ టెక్ సమాచారాన్ని ప్రచురించే ‘రెస్ట్‌ఆ్‌ఫవరల్డ్’ వెబ్‌సైట్ వెల్లడించింది. వీటిలో 1,125 ఖాళీలు భారత్‌లోనే ఉన్నాయి. సింగపూర్‌లో 23, యూకేలో 18 ఖాళీలను జాబితాలో చూపింది. ఇక అమెరికాలోనే 89 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఏళ్ల తరబడి అమెరికాలో పనిచేసి ఇప్పుడు వేరే దేశానికి మారాలంటే ఆ ఉద్యోగులపై భారీగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఐబీఎం ఉద్యోగానికి భారత్‌కు వెళితే జీతంలో 80 శాతం తగ్గిపోతుందని ఓ భారతీయ టెకీ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఐబీఎం నిర్ణయం టెక్ ఇండస్ట్రీలో వస్తున్న విస్తృత మార్పులకు నిదర్శనమని ఇన్‌క్రూటర్ సంస్థ సీఈవో అనిల్ అగర్వార్ అభివర్ణించారు. కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు.