ఎఫ్-35 దగ్గరకు కూడా రానివ్వరు.. ఇక వాటిని మాకు విక్రయిస్తారా!: ఐఏఎఫ్ చీఫ్
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:53 AM
అమెరికాకు చెందిన అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానం ఎఫ్-35 కోనుగోలుపై భారత వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 11: అమెరికాకు చెందిన అత్యాధునిక ఐదో తరం యుద్ధ విమానం ఎఫ్-35 కోనుగోలుపై భారత వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఎఫ్-35 విమానాలను విక్రయించడానికి అమెరికా ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని ఆయన పేర్కొన్నారు. జోధ్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్ శక్తి-2026’ ముగింపు కార్యక్రమంలో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎఫ్-35 యుద్ధ విమానాల దగ్గరకు కూడా భారత అధికారులను వెళ్లనివ్వడం లేదు.. అలాంటిది ఇక వాటిని మాకు అమ్ముతామని ఎలా మాట్లాడుతున్నారు?’’ అని అమెరికాకు చురకలు అంటించారు. ఎఫ్-35 విమానాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఏదైనా ప్రతిపాదన చేసిందా అన్న ప్రశ్నకు ఐఏఎఫ్ చీఫ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యూఎస్ పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ ష్నైడర్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే, తాను సరదాగానే ఈ కామెంట్స్ చేశానని, దీన్ని సీరియ్‌సగా తీసుకోవద్దని పేర్కొన్నారు.