బాబ్ ఎల్ మాండెబ్‌పై హుతీల గురి
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:08 AM
అమెరికా-ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకారవాణాకు తీవ్ర విఘాతం కలుగుతున్న తరుణంలోనే.. ఆ ప్రాంతంలోని మరో కీలక జలసంధి ప్రమాదంలో పడింది.
కీలక జలసంధి సమీపంలోని దీవి స్వాధీనం
దుబాయ్, సెప్టెంబరు 11: అమెరికా-ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకారవాణాకు తీవ్ర విఘాతం కలుగుతున్న తరుణంలోనే.. ఆ ప్రాంతంలోని మరో కీలక జలసంధి ప్రమాదంలో పడింది. నౌకల ద్వారా ప్రపంచంలో జరుగుతున్న సరుకు రవాణాలో 12ు వాటా కలిగిన బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై యెమెన్‌లోని తిరుగుబాటు హుతీలు పట్టు బిగిస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే ఈ సన్నని జలమార్గం ఆసియా- యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేయటంలో అత్యంత కీలకమైంది. ఈ జలసంధికి సమీపంలో ఉన్న మయున్ (పెరిమ్) అనే ద్వీపాన్ని హుతీలు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాతో హుతీలు భీకరంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జలసంధి ద్వారా వెళ్లే సౌదీ చమురు నౌకలపై దాడులు చేస్తామని హుతీలు హెచ్చరించారు. హోర్ముజ్ జలసంఽధిలో నౌకలను ఇరాన్ అడ్డుకోవటంతో సౌదీ తన చమురును బాబ్ ఎల్ మాండెబ్ నుంచి తరలిస్తోంది. తాజాగా ఆ మార్గం కూడా ప్రమాదంలో పడటంతో అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. ఎర్ర సముద్రం వెంట ఉన్న యెమెన్ తీరప్రాంతాన్ని మొత్తం హుతీలు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన నౌకాకేంద్ర నగరం మోఖాను గురువారం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారి నుంచి మోఖాను విడిపించేందుకు సౌదీ వైమానికదళం ఆ నగరంలోని విమానాశ్రయంపై శుక్రవారం బాంబుదాడులు చేసింది. ఇదిలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా, హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఏకంగా 1,100 టన్నుల బాంబులు కుమ్మరించింది. పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.