మరో జలసంధి మూసివేత?
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:44 AM
ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతోంది. వాణిజ్య నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో చాలా దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.....
ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న హౌతీ గ్రూపు
ట్రిగ్గర్‌పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయని ప్రకటన
‘బాబ్ ఎల్-మన్‌దెబ్’ జలసంధిని దిగ్బంధించేందుకు యత్నించే అవకాశం
న్యూఢిల్లీ, మార్చి 15: ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతోంది. వాణిజ్య నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో చాలా దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో వాణిజ్యపరంగా మరో కీలక జలసంధి ‘బాబ్ ఎల్-మన్‌దెబ్’ మూసివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. అదే జరిగితే.. ఇది ప్రపంచ వాణిజ్యానికి విఘాతంగా మారవచ్చు! గత రెండు వారాలుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంలో నిశ్శబ్దంగా ఉన్న యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు ‘హౌతీలు’ కూడా కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హౌతీలు ఇరాన్ యుద్ధంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ‘ట్రిగ్గర్‌పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయి. పరిణామాలకు అనుగుణంగా అవసరమైతే ఏ క్షణంలోనైనా రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు హౌతీ నేత అబ్దుల్ మాలిక్ ప్రకటన చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇది బాబ్ ఎల్-మన్‌దెబ్ జలసంధి దిగ్బంధనానికి దారితీయవచ్చని హెచ్చరించింది.
బాబ్ ఎల్-మన్‌దెబ్ ప్రాధాన్యం..
హోర్ముజ్ మాదిరిగానే ‘బాబ్ ఎల్-మన్‌దెబ్’ జలసంధి కూడా ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది ఎర్ర సముద్రం ద్వారా మధ్యదరా సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్‌ను, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. అట్లాంటిక్ సముద్రం వరకు కూడా లింక్ ఏర్పాటు చేస్తుంది. ఈ మార్గం ఆసియా-యూరప్ వాణిజ్యంలో అత్యంత కీలకమైనది. ఈ రెండు ఖండాల మధ్య సూయెజ్ కాలువ ద్వారా వెళ్లే ఏ నౌక అయినా ఈ జలసంధి గుండా వెళ్లాల్సిందే. చాలా కాలంగా ‘బాబ్ ఎల్-మన్‌దెబ్’ జలసంధిపై ఆధిపత్యం సంపాదించేందుకు, ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీలు ఈ మార్గాన్ని ఆడ్డుకుంటే.. వాణిజ్య పరంగా పర్యావసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోర్ముజ్, బాబ్ ఎల్-మన్‌దెబ్ జలసంధులు రెండూ కలిపి ప్రపంచ సముద్ర రవాణా చమురులో సుమారు 30 శాతం వాటా కలిగి ఉన్నాయి.
రెండో వ్యూహాత్మక పాయింట్‌కు విస్తరణ
ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా వంటి దేశాలు యుద్ధంలో చేరితే లేదా టెహ్రాన్‌పై దాడులు తీవ్రమైతే.. తాము సముద్ర మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. తద్వారా వారు బాబ్ ఎల్-మన్‌దెబ్ జలసంధిపై గురిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హౌతీలు ఇంతకుముందు కూడా ఈ మార్గాన్ని మూసివేసేందుకు యత్నించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మిలటరీ సీనియర్ నేత చేసిన హెచ్చరిక కూడా కీలకంగా మారింది. తమ సముద్ర దిగ్బంధనాన్ని రెండో వ్యూహాత్మక చెక్ పాయింట్‌కు విస్తరించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణ త్వరలో విస్తృతమైన ప్రాంతీయ యుద్ధంగా మారనుందన్నార. బాబ్ ఎల్-మన్‌దెబ్‌తో పాటు టెహ్రాన్ వద్ద ఇంకా ‘ఆట ఆడేందుకు అనేక కార్డులు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
ప్రత్యామ్నాయం ఏంటి?
ఒకవేళ నౌకలు సూయెజ్ కాలువ ద్వారా బాబ్ ఎల్-మన్‌దెబ్ గుండా ప్రయాణించేందుకు వీలు లేకుంటే.. సముద్ర రవాణా మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ (ఆఫ్రియా దక్షిణ కొన) గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీని వలన ఆసియా-యూరప్ మధ్య సాధారణంగా 20-25 రోజులు పట్టే ప్రయాణం.. 30-40 రోజులకు పెరుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం, సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే చమురులో 10 శాతం, అలాగే గణనీయమైన ఎల్‌ఎన్‌జీ పరిమాణం ఈ కారిడార్ గుండా రవాణా అవుతుంది. 2014లో సనాను తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత యెమెన్ ఎర్ర సముద్రంపై హౌతీలదే ఆధిపత్యంగా ఉంది. ఆ రీజియన్‌లో వారు పదేపదే నౌకలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ బాబ్ ఎల్-మన్‌దెబ్ జలసంధిని దిగ్బంధించడంలో హౌతీలు విజయం సాధిస్తే.. అది ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర పరిణామంగా మారే అవకాశం ఉంది.