యుద్ధ రంగంలోకి హౌతీలు!
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:16 AM
యెమెన్‌లోని ఇరాన్ అనుకూల హౌతీ గ్రూపు కూడా యుద్ధంలోకి దిగింది. ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శనివారం క్షిపణులు ప్రయోగించింది....
యెమెన్‌లోని ఇరాన్ అనుకూల హౌతీ గ్రూపు కూడా యుద్ధంలోకి దిగింది. ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని శనివారం క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం మొదలైన సమయంలోనే హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా రావొచ్చని భావించినా ఇప్పటివరకు సంయమనం పాటించారు. ఇరాన్‌కు అవసరమైతే తాము రంగంలోకి వస్తామని , అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని శుక్రవారమే ప్రకటించారు. ఆ మరునాడే ఇజ్రాయెల్‌పైకి దాడులు చేపట్టడం గమనార్హం. ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చే కీలకమైన ‘బాబ్ అల్ మందేబ్’ జలసంధిపై హౌతీలకు పట్టుంది. హోర్ముజ్ జలసంధి లాగే ఇది కూడా కేవలం 30 కిలోమీటర్ల వెడల్పు ఉన్న మార్గం. యూరప్ దేశాల నుంచి సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం మీదుగా ఆసియా దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది. ఇప్పుడు ‘బాబ్ అల్ మందేబ్’లో నౌకలపై హౌతీలు దాడి చేస్తే.. సముద్ర రవాణాకు ఇబ్బంది తప్పదు. అదే జరిగితే చమురు ధరలు మరింత పెరగడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.