హోర్ముజ్ విముక్తికి సిద్ధం!
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:35 AM
హోర్ముజ్ జలసంధి విముక్తికి రంగం సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జలసంధి మూసివేత కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాలు..
చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే
యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్నా
ఇరాన్ ఓడిపోయి ఒప్పందం కోసం చూస్తోంది
కానీ, నేను ఆ ఒప్పందాన్ని అంగీకరించను
త్వరలో హోర్ముజ్‌ను తెరిచి తీరుతాం: ట్రంప్
ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా బాంబుల వర్షం
చమురు సరఫరా, ఎగుమతుల వ్యవస్థలను మాత్రం వదిలేశామని వెల్లడి
దీటుగా ప్రతిస్పందించిన ఇరాన్.. అమెరికా చమురు వ్యవస్థలను బూడిద చేస్తామని ప్రకటన
యూఏఈలోని ఫుజైరా పోర్టుపై డ్రోన్ దాడి
దెబ్బతిన్న 5 అమెరికా కేసీ-135 విమానాలు
యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో మంటలు
ఖమేనీ సమాచారమిస్తే 92 కోట్లు: అమెరికా
అమెరికా బలగాల సమాచారమిస్తే రూ.కోటి
బహుమతి ఇస్తామన్న ఇస్లామిక్ రెసిస్టెంట్
దుబాయ్, వాషింగ్టన్, మార్చి 14: హోర్ముజ్ జలసంధి విముక్తికి రంగం సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జలసంధి మూసివేత కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాలు.. అమెరికాతో కలిసి ఆ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచేందుకు వారి యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఇరాన్ పూర్తిగా ఓడిపోయి, ఒప్పందం కోసం ఎదురుచూస్తోందని.. కానీ ఆ ఒప్పందాన్ని తాను అంగీకరించబోనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘హోర్ముజ్ మూసివేతతో ప్రభావితమైన దేశాలు సహా చాలా దేశాలు యుద్ధనౌకలను పంపనున్నాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని వంద శాతం నాశనం చేశాం. వారు ఎంతగా ఓడిపోయినా కూడా అక్కడి అనుకూలతల మే రకు ఇరాన్ సులభంగానే ఒకట్రెండు డ్రోన్లు పంపడానికి, సీమైన్ (సముద్రపు మందుపాతర) పెట్టడానికి, స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అవకాశం ఉంది. హోర్ముజ్‌లో కృత్రిమ ఆటంకాలతో ప్రభావితమైన చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, ఇతర దేశాలు వారి యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్నాను. అలా చేస్తే ఇకపై కేవలం ఒక దేశం కారణంగా హోర్ముజ్ జలసంధికి ముప్పు ఉండదు. అదే సమయంలో ఇరాన్ తీరప్రాంతాలపై అమెరికా తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తూనే ఉంటుంది. ఇరాన్ నౌకలను, బోట్లను ముంచేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా త్వరలోనే హోర్ముజ్ జలసంధిని తెరిచి భద్రంగా, స్వేచ్ఛగా మారుస్తాం..’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పశ్చిమాసియా మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని, ఇజ్రాయెల్‌ను నామరూపాలు లేకుండా నాశనం చేయాలని ప్రణాళికలు వేసుకుందని.. కానీ ఇప్పుడా దేశం పరిస్థితిలాగానే ప్రణాళికలూ చచ్చిపోయాయని వ్యాఖ్యానించారు.
సౌదీలో ఐదు అమెరికా విమానాలు ధ్వంసం!
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ సైనిక స్థావరంపై ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో ఐదు అమెరికన్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానాలు దెబ్బతిన్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇరాక్‌లో ఒక కేసీ-135 విమానం కూలిపోయి ఆరుగురు అమెరికా సైనికులు మృతిచెందడం, దాన్ని కూల్చింది తామేనని ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రిపబ్లిక్ తీవ్రవాద సంస్థ ప్రకటించడం నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఇరాన్ చేసిన దాడిలో ఐదు కేసీ-135 విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఈ కథనంపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించేలా శీర్షికలు పెడుతున్నాయని విమర్శించారు. సౌదీలోని స్థావరంపై దాడి జరిగిందని, ఒక విమానానికి మాత్రం కొంతనష్టం జరిగిందని చెప్పారు. మిగతా నాలుగు విమానాలు సర్వీసులో ఉన్నాయన్నారు.
అమెరికా వ్యవస్థలను బూడిద చేస్తాం: ఇరాన్
ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు మార్చుకోకపోతే.. పశ్చిమాసియాలో అమెరికాకు సంబంధమున్న, అమెరికా సంస్థల వాటాలు ఉన్న చమురు క్షేత్రాలు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటామని, వాటన్నింటినీ బూడిద చేస్తామని హెచ్చరించింది. మరోవైపు, హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, కానీ ‘‘మా శత్రువులు, వాటి మిత్రదేశాల నౌకలు, చమురు ట్యాంకర్లను మాత్రం అనుమతించబోం’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమపై అన్యాయంగా చేపట్టిన దాడులు పదిహేనో రోజుకు చేరుకున్నాయని, ఈ పరిస్థితుల్లోనూ దేశంలో పాలన ప్రశాంతంగా కొనసాగుతోందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల సహకారంతో ఈ కష్టకాలాన్ని త్వరలోనే అధిగమిస్తామని, మునుపటికంటే మెరుగ్గా దేశాన్ని పునర్నిర్మించుకుంటామని తెలిపారు.
మొజ్తాబా సమాచారమిస్తే రూ.92 కోట్లు!
ఇరాన్ కీలక నేతలకు సంబంధించిన పక్కా సమాచారం అందజేస్తే రూ.92కోట్ల(10 మిలియన్ డాలర్ల) వరకు నజరానా అందజేస్తామని అమెరికా ప్రకటించింది. అవసరమైతే ఆ సమాచారం ఇచ్చినవారిని ఇతర ప్రాంతాలకు తరలించి భద్రమైన జీవితం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజని, నిఘా శాఖ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, సైనిక దళాల డిప్యూటీ చీప్ అలీ అస్ఘర్, మేజర్ జనరల్ యహ్య రహీమ్ ఇతర కీలక నేతలు, ఐఆర్‌జీసీ ఉన్నతాధికారుల సమాచారం ఇవ్వాలని కోరింది.
అమెరికా బలగాల సమాచారమిస్తే రూ. కోటి
ఇరాక్‌లో అమెరికా సైనిక బలగాల ఏర్పాట్లు, కదలికలపై కచ్చితమైన సమాచారం అందిస్తే రూ.కోటి (150 మిలియన్ ఇరాకీ దినార్లు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెంట్ సంస్థ ప్రకటించింది. ఇరాక్ వ్యాప్తంగా ఎక్కడ అమెరికా సైనికులు, బలగాలు ఉన్నా సమాచారం ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇరాక్‌లో కూలిపోయిన కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానాన్ని పడగొట్టింది తామేనని ఇస్లామిక్ రెసిస్టెంట్ పేర్కొనడం గమనార్హం.
యూఏఈలోని ఫుజైరా పోర్టులో పేలుళ్లు
దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు, అబుధాబిలోని ఖలీఫా పోర్టు, ఫుజైరా పోర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. ఆ పోర్టుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా మిలిటరీపై తీవ్రస్థాయిలో దాడులు చేయనున్నట్టు ప్రకటించింది. అన్నట్టుగానే క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఫుజైరా పోర్టులోని చమురు టెర్మినల్‌ను తాకిన డ్రోన్లు పేలుళ్లు సృష్టించాయి. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనితో నౌకల్లో చమురు నింపే టెర్మినల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఫుజైరా పోర్టు హోర్ముజ్ జలసంధికి తూర్పు వైపున గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉంటుంది. హోర్ముజ్ జలసంధి స్తంభించినప్పుడు.. పశ్చిమ దిశ నుంచి యూఏఈ భూభాగం మీదుగా పైపులైన్ల ద్వారా కొంతమేర చమురును అవతలికి తరలించి ట్యాంకర్లలో నింపడానికి వీలుంటుంది. ఇప్పుడా పోర్టుపైనా ఇరాన్ దాడి చేయడం గమనార్హం. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై శనివారం క్షిపణి దాడి జరిగింది. పెద్ద ఎత్తున పేలుడు జరిగి, దట్టంగా పొగలు వెలువడ్డాయి. ఈ ఎంబసీలోని సీ-రామ్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. శనివారం ఒక్కరోజే ఇరాన్ ప్రయోగించిన 9 క్షిపణులు, 33 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ తెలిపింది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్‌లోని ఓ భవనంపై డ్రోన్లు, క్షిపణుల శకలాలు పడి పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని జేరుసలేంలో వరుస పేలుళ్లు జరిగాయి.
భూతల దాడులకు సిద్ధం?
హోర్ముజ్ జలసంధిని ఎలాగైనా తెరవాలన్న ఉద్దేశంతో ఉన్న అమెరికా..పశ్చిమాసియాకు ప్రత్యేక బలగాలను తరలిస్తోంది. శనివారం 2,500 మంది యూఎస్ మెరైన్ , మరో 2,500 మంది నావికా దళ సిబ్బందిని తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో నౌకల నుంచి బయటికి వచ్చి..బోట్ల తరహాలో నీటిపై ప్రయాణిస్తూ తీరానికి చేరుకుని, భూమిపై ప్రయాణిస్తూ దాడులు చేసే ‘యాంఫిబియస్ రెడీ గ్రూపు’ వాహనాలు, సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. మరోవైపు సైనిక హెలికాప్టర్ల ద్వారా తీర ప్రాంతానికి చేరుకుని తీవ్రస్థాయిలో దాడులు చేసే ‘మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‘ బలగాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతోందన్న సంకేతాలు ఇస్తున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్ చవక డ్రోన్లతో చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు డ్రోన్లను వినియోగించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతానికి 10 వేల ‘మెరోప్స్’ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను పంపుతున్నట్టు అమెరికా ఆర్మీ సెక్రెటరీ డాన్ డ్రిస్కోల్ వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో అవి పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంటాయి.
ఖార్గ్ దీవిపై అమెరికా బాంబుల వర్షం
ఇరాన్‌కు చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ దీవిపై అమెరికా శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. దీవిలోని 90కిపైగా మిలిటరీ వ్యవస్థలు, సీమైన్లు, క్షిపణులను నిల్వ చేసిన బంకర్లను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. చమురుకు సంబంధించిన సదుపాయాలను మాత్రం వదిలేశామని తెలిపింది. ఈ మేరకు ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోను విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు ఆపకపోతే.. ఇరాన్ చమురు ఉత్పత్తి, రవాణా వ్యవస్థలపైనా తీవ్రస్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. తన ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటివరకు పశ్చిమాసియా చరిత్రలో లేనంత స్థాయిలో ఖర్గ్ దీవిపై బాంబు దాడులు చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘‘మేం దాడి చేయాలనుకునే ఏ లక్ష్యాన్ని కూడా రక్షించుకునే సామర్థ్యం ఇరాన్‌కు లేదు. ఇరాన్ ఉగ్రవాద పాలనకు తోడ్పడుతున్న మిలిటరీ, ఇతర శక్తులు వెంటనే తమ ఆయుధాలను వదిలిపెట్టి, మిగిలిన కాస్త దేశాన్ని కాపాడుకోవడం మంచిది’’ అన్నారు.
ఇరాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ధ్వంసం
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశంపై నిఘా, క్షిపణి దాడులకు లక్ష్యాలను ఎంచుకోవడం కోసం ఇరాన్ అక్కడి నుంచే మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించిందని పేర్కొంది. అదే ప్రాంతంలోని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి ఫ్యాక్టరీని కూడా నాశనం చేశామని వెల్లడించింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో జరిగిన వైమానిక దాడుల్లో 15 మంది చనిపోయారని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,444 మంది, ఇరాక్‌లో 26, ఇజ్రాయెల్, యూఏఈ, కువైట్‌లలో ఆరుగురు చొప్పున, ఒమన్‌లో ముగ్గురు, బహ్రెయిన్, సౌదీలలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనికులు 13 మంది మృతిచెందారు. లెబనాన్‌లో మృతుల సంఖ్య 826కు, గాయపడ్డ వారి సంఖ్య 2,009కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో మంటలు
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక యూఎ్‌సఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో ఇటీవల మంటలు చెలరేగాయి. ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. నౌక ప్రొపల్షన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని, పూర్తిస్థాయిలో పనిచేస్తోందని తెలిపింది. నౌకపై ఎలాంటి దాడి జరగలేదని, లాండ్రీ ప్రాంతంలో సమస్యతో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే అమెరికా యుద్ధ నౌకలను, కీలక రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక క్షిపణులను ప్రయోగించనున్నామని ఇటీవల ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. గెరాల్డ్ ఫోర్డ్ నౌకలో మంటలు చెలరేగడం సందేహాలు రేపుతోంది. ఇరాన్ క్షిపణిదాడిగానీ, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెంట్ గ్రూపు దాడిగానీ ఈ మంటలకు కారణం కావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎర్ర సముద్ర ప్రాంతంలో మోహరించి ఉన్న ఈ యుద్ధ నౌక ఇరాన్‌పై దాడుల్లో పాల్గొంటోంది. అందులో 4,500 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఇటీవల ఈ నౌకలోని పైపులైన్లలో సమస్యలు తలెత్తి టాయిలెట్లు పనికిరాకుండా పోయాయి.