Share News

ఆహారంపై యుద్ధ కోరలు

ABN , Publish Date - May 03 , 2026 | 04:11 AM

హోర్ముజ్‌ దిగ్బంధనం కారణంగా భారీగా తగ్గిన ముడిచమురు లభ్యత అంతర్జాతీయ ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ఎరువుల తయారీకి తగినంత ముడిచమురు దొరక్కపోవడంతో..

ఆహారంపై యుద్ధ కోరలు

  • హోర్ముజ్‌ దిగ్బంధనంతో ఎరువుల కొరత.. తగ్గుతున్న పంట దిగుబడులు

  • యారా ఇంటర్నేషనల్‌ సీఈవో స్వీన్‌ తోర్‌ ఆందోళన

లండన్‌, మే 2: హోర్ముజ్‌ దిగ్బంధనం కారణంగా భారీగా తగ్గిన ముడిచమురు లభ్యత అంతర్జాతీయ ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ఎరువుల తయారీకి తగినంత ముడిచమురు దొరక్కపోవడంతో.. ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఫిబ్రవరి నెల చివర్లో ఈ యుద్ధం మొదలుకాగా.. అప్పటికి అంతర్జాతీయ విపణిలో దాదాపు 450 డాలర్లున్న టన్ను యూరియా ధర మూడువారాల్లోనే 700 డాలర్ల మార్కును దాటేసింది. ఎరువుల ధరలు భారీగా పెరిగిపోవడం, అదే సమయంలో పంటల మద్దతు ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రైతులకు ఎరువులను కొనే శక్తి నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ప్రపంచబ్యాంకు తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరాకు ఆటంకం కలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వారానికి 1000కోట్ల భోజనాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని.. దీని ప్రభావం పేద దేశాలపై అత్యంత తీవ్రంగా ఉంటుందని ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల తయారీ సంస్థల్లో ఒకటైన యారా ఇంటర్నేషనల్‌ సీఈవో స్వీన్‌ తోర్‌ హోల్‌సెథెర్‌ హెచ్చరించినట్టు బీబీసీ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. ‘‘యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల టన్నుల నైట్రోజన్‌ ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల వారానికి 1000 కోట్ల భోజనాలు ఉత్పత్తి కాకుండా పోతాయి (ఆ 5 టన్నుల నత్రజని ఎరువులు అందుబాటులో ఉంటే వాటివల్ల పండే పంట 1000 కోట్ల భోజనాలకు సరిపోతుంది). నైట్రోజన్‌ ఎరువులు వాడకపోతే కొన్ని పంటల దిగుబడి 50 శాతం దాకా తగ్గిపోతుంది.’’ అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. పంట దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆహారం కోసం దేశాల మధ్య ‘బిడ్డింగ్‌ వార్‌’ జరిగే ప్రమాదం కూడా ఉందని స్వీన్‌ తోర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బిడ్డింగ్‌ వార్‌’ అంటే.. ఆహార లభ్యత తగ్గిపోవడంతో దానికి డిమాండ్‌ పెరిగిపోతుంది. మార్కెట్లో తక్కువగా ఉన్న ఆహారం కోసం దేశాలన్నీ పోటీపడతాయి. ఈ పోటీలో.. అమెరికా వంటి సంపన్న దేశాలు ఎక్కువ డబ్బు వెచ్చించి తమ ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని కొనేసుకుంటాయి. ఆయా దేశాలతో తులతూగలేని పేద దేశాల ప్రజలు ఆకలికి మలమల మాడిపోతారు.


మూడింట ఒకవంతు..

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా యూరియా, పొటాష్‌, అమ్మోనియా, ఫాస్పేట్ల వంటి ఎరువుల్లో మూడింట ఒకవంతు సాధారణంగా హోర్ముజ్‌ జలసంధి గుండానే రవాణా అవుతాయి. ప్రపంచం మొత్తానికీ ఎగుమతి అయ్యే యూరియాలో సుమారు 45ు నుంచి 50ు వాటా కేవలం గల్ఫ్‌ దేశాలదే. ఇక, ఫాస్పేట్‌ ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సల్ఫర్‌ ఎగుమతుల్లో కూడా 50ు వాటా గల్ఫ్‌ దేశాలదే. నత్రజని ఎరువుల తయారీకి కీలకమైన అమ్మోనియా వాణిజ్యంలో 20 నుంచి 25 శాతం గల్ఫ్‌ ప్రాంతం నుంచే జరుగుతుంది. హోర్ముజ్‌ మూసివేతతో ఈ ఎరువుల ముడిసరుకుల రవాణా ఆగిపోయింది. ఈ ప్రభావం భారత్‌పైనా తీవ్రంగా పడుతోంది.

Updated Date - May 03 , 2026 | 04:11 AM