Moni Chakraborty: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:28 AM
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు ఆగటం లేదు. సోమవారం రాత్రి మరో హిందువును పొట్టనపెట్టుకున్నారు...
రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు
డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ ఏడుగురు హిందువుల బలి
ఢాకా, జనవరి 6: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువుల ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు ఆగటం లేదు. సోమవారం రాత్రి మరో హిందువును పొట్టనపెట్టుకున్నారు. మృతుడు 40 ఏళ్ల వయసున్న మోనీ చక్రవర్తి ఓ కిరాణా కొట్టు యజమాని. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాత్రి 11 గంటలకు కొందరు దుండగులు ఆయన మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మోనీని పోలీసులు సమీపంలోని అస్పత్రికి తరలించినప్పటికీ.. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన పాలాష్ ఉపజిలాలోని చార్‌సింధూర్ బజార్‌లో జరిగింది. మోనీ తండ్రి మదన్ ఠాకూర్.. షిబ్‌పూర్ ఉపజిలాకు చెందిన సదాచార్ యూనియన్ సభ్యుడని పోలీసులు తెలిపారు. కాగా, సోమవారం రాణా ప్రతాప్ భైరాగి అనే జర్నలిస్టు కూడా హత్యకు గురైన విషయం తెలిసిందే. అంతకుముందు కొకొన్ చంద్రదాస్, అమృత్ మండల్, దీపుచంద్రదాస్ తదితరులు మూకదాడుల్లో మరణించారు. సోమవారం ఓ హిందూ వితంతువు మీద ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. హిందువుల నివాసాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల తిరుగుబాటుతో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవిని వీడి భారత్‌కు పారిపోయిన అనంతరం.. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులు మొదలయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ ఏడుగురు హిందువులు మరణించారు.