రంగంలోకి హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ భీకర దాడి
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:10 AM
ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా.. తమ దేశ ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఆదివారం అర్ధరాత్రి అనంతరం ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది.
ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా.. తమ దేశ ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఆదివారం అర్ధరాత్రి అనంతరం ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై భీకర స్థాయిలో దాడులు చేపట్టింది. నిజానికి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఏడాది క్రితమే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టినప్పుడు కూడా హెజ్బొల్లా కల్పించుకోలేదు.. ఇరాన్‌పై దాడుల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెజ్బొల్లాపై లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది కూడా. కానీ ఖమేనీ మృతి నేపథ్యంలో హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో సోమవారం లెబనాన్ రాజధాని బీరూట్, ఇతర ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలు, ఆస్తులపై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. హెజ్బొల్లా రాజకీయ విభాగం చీఫ్ మొహమ్మద్ రాడ్, నిఘా విభాగం చీఫ్ హుస్సేన్ మాక్లెడ్‌ను హతమార్చినట్టు ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో 54 మంది మరణించారని, 154 మంది గాయపడ్డారని లెబనాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో.. హెజ్బొల్లా తీరు ప్రమాదకరంగా మారుతోందని గుర్తించిన లెబనాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. లెబనాన్‌లో హెజ్బొల్లా మిలటరీ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాఫ్ సలామ్ ప్రకటించారు. వెంటనే ఆయుధాలన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. లెబనాన్ భూభాగంపై వెంటనే దాడులు నిలిపివేయాలని, దీనిపై చర్చలు చేపడదామని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు.
