ఇరాన్-అమెరికా దౌత్యవేత్తల మధ్య తీవ్ర వాగ్వాదం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:12 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో శనివారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం ఆయా దేశాల ...
దాడులను నిలిపివేయాలని యూఎన్‌వో విజ్ఞప్తి
న్యూయర్క్, మార్చి 1: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో శనివారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం ఆయా దేశాల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ప్రాంతీయ యుద్ధ భయాల దృష్ట్యా తక్షణమే దాడులు ఆపి చర్చల దిశగా అడుగులు వేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ విజ్ఞప్తి చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంటూనే, అరబ్ దేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించిన ఇరాన్ ప్రతీకార చర్యలను కూడా ఖండించారు. అయితే, అమెరికా రాయబారి మైక్ వాల్జ్ తమ సైనిక చర్యలను గట్టిగా సమర్థించుకున్నారు. ‘‘ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదనేది కేవలం రాజకీయ నిర్ణయం కాదు. ప్రపంచ భద్రతకు సంబంధించిన విషయం.’’అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాయబారి సైతం దాడులు అనివార్యమని పేర్కొన్నారు. అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులతో ప్రపంచాన్ని బెదిరించే ఏ శక్తినైనా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. చర్చలు ముగిసే సమయంలో అమెరికా, ఇరాన్ రాయబారుల మధ్య వ్యక్తిగత విమర్శలు సాగాయి. ‘‘అమెరికా ప్రతినిధి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి’’ అని ఇరాన్ ప్రతినిధి అమీర్ ఇరవానీ హెచ్చరించారు. దీనికి మైక్ వాల్జ్ట్ బదులిస్తూ, ‘‘వేలమంది సొంత ప్రజలనే పొట్టన బెట్టుకుని, నియంతృత్వంతో పాలించే దేశ ప్రతినిధి మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.’’ అన్నారు.