హెచ్-1బీ వీసాదారులకు షాక్!
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:10 AM
వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఏడాదిగా ఎదురుచూస్తుండగా..
వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు వాయిదా
న్యూఢిల్లీ, జనవరి 25: వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఏడాదిగా ఎదురుచూస్తుండగా.. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన వారి ఇంటర్వ్యూ స్లాట్లు 2027కు వాయిదా పడ్డాయి. భారత్‌లోని అమెరికా రాయబార కేంద్రాల్లో బ్యాక్‌లాగ్స్ భారీగా పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో ఇప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలలు వాయిదా వేసి 2027కు మార్చినట్లు తెలిసింది. దీనివల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులపై ప్రభావం పడనుంది. గతేడాది డిసెంబరులోనే ఈ జాప్యం మొదలైంది. దీంతో అప్పట్లో అపాయింట్‌మెంట్లను 2026 మార్చికి మార్చారు. ఆ తర్వాత జూన్‌కు, ఆపై అక్టోబరుకు వాయిదా వేశారు. మళ్లీ ఇప్పుడు 2027కు మార్చారు. ఈ పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశం లేదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ తేదీలు నిరంతరం వాయిదా పడుతున్నందున ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ‘అమెరికన్ బజార్’ సంస్థ కూడా 2027 వరకూ సాధారణ అపాయింట్‌మెంట్లు కూడా అందుబాటులో లేవని వెల్లడించింది. స్టాంపింగ్ కోసం గత నెల భారత్‌కు వచ్చిన వారి ఇంటర్వ్యూలు కూడా రద్దైనట్టు పేర్కొంది.