Share News

హెచ్‌-1బీ వీసాదారులపై పిడుగు!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:15 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య ముదురుతున్న యుద్ధం విదేశీ ఉద్యోగులకు సంకటంగా మారుతోంది. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తూ ఆకస్మిక ప్రయాణాలతో....

హెచ్‌-1బీ వీసాదారులపై పిడుగు!

  • తాజా యుద్ధంతో ఉద్యోగాలకు తీవ్ర ముప్పు

  • వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం.. అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్‌

న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికా, ఇరాన్‌ మధ్య ముదురుతున్న యుద్ధం విదేశీ ఉద్యోగులకు సంకటంగా మారుతోంది. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తూ ఆకస్మిక ప్రయాణాలతో సెలవుపై స్వదేశానికి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి అమెరికా చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గల్ఫ్‌ దేశాల నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు కాగా, చాలావరకూ ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు దేశాల్లో ఇమిగ్రేషన్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. మరోవైపు వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం, పలువురి అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ కావడంతో వర్క్‌ వీసాలపై ఉన్న వేలాది మంది తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. తమ ఉద్యోగానికి ముప్పు ఏర్పడుతుందేమోనని ఆందోళనతో పాటు చట్టబద్ధమైన హోదాను కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. వీసా స్టాంపింగ్‌ కోసం, కుటుంబ వేడుకలకు హాజరయ్యేందుకు స్వదేశానికి వచ్చినవారు చెల్లుబాటయ్యే వీసా ఉన్నప్పటికీ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పలువురు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్‌ న్యాయవాది రాహుల్‌రెడ్డి తెలిపారు. హెచ్‌-1, ఎల్‌-1 వీసాలపై ఉన్నవారు సాధారణంగా దుబాయ్‌, దోహా, అబుధాబి మీదుగానే స్వదేశాలకు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఈ మార్గాలు యుద్ధం కారణంగా ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉంటున్న ఉద్యోగులు అత్యవసరమైతే తప్ప స్వదేశాలకు ప్రయాణాలు మానుకోవాలని ఇమిగ్రేషన్‌ నిపుణులు సూచిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు అమెరికా వెలుపల చిక్కుకుపోయేవారు ఉద్యోగం కోల్పోయే ప్రమా దం ఉందని, వీసా చార్జీల పెంపు కారణంగా వీరు మరో కంపెనీలో ఉద్యోగం పొందడం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల నుంచి లాంగ్‌ లీవ్‌ తీసుకోవడం లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2026 | 04:15 AM