Share News

హెచ్‌-1బీ మోసాలపై అమెరికా ఉక్కుపాదం

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:32 AM

అమెరికా హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విదేశీ కార్మికుల నియామకాల పేరుతో జరుగుతున్న మోసాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.

హెచ్‌-1బీ మోసాలపై అమెరికా ఉక్కుపాదం

  • 365 రోజుల్లో అంతా మారిపోవచ్చంటున్న ట్రంప్‌ సర్కార్‌

  • విదేశీ కార్మికుల వీసాల్లో మోసాలపై దర్యాప్తు ముమ్మరం

  • భారీగా సమన్లు, సెర్చ్‌ వారెంట్లు కాగ్నిజెంట్‌, క్లౌడ్‌ఎరా దరఖాస్తుల సస్పెండ్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 27: అమెరికా హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విదేశీ కార్మికుల నియామకాల పేరుతో జరుగుతున్న మోసాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాబోయే ఏడాది కాలంలో హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ స్వరూపమే పూర్తిగా మారిపోనుందని అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంటోనీ డీఎస్పోసిటో సంకేతాలిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌-1బీ వ్యవస్థలో జరుగుతున్న వ్యవహారం కేవలం కాగితాల పరిశీలనతో ముగిసేది కాదని, వాస్తవంగా జరుగుతున్న అక్రమాలపై క్రిమినల్‌ స్థాయి దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. అయితే, ఈ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయబోమని, కానీ అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు, అరెస్టులు, విధానపరమైన నిబంధలను తీవ్రతరం అవుతాయని స్పష్టం చేశారు.


కాగ్నిజెంట్‌, క్లౌడ్‌ఎరా దరఖాస్తుల సస్పెండ్‌!

కార్మిక శాఖకు చెందిన ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌’ దేశవ్యాప్తంగా ఇప్పటికే హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం, మోసం, మానవ అక్రమ రవాణాపై తనిఖీలను ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పలు చోట్ల సెర్చ్‌ వారెంట్లతో సోదాలు నిర్వహించి, డజన్ల కొద్దీ సమన్లు జారీ చేసింది. క్రిమినల్‌ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున ప్రముఖ ఐటీ సేవల సంస్థ ‘కాగ్నిజెంట్‌’, సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘క్లౌడ్‌ఎరా’లకు చెందిన వీసా దరఖాస్తులను కార్మిక శాఖ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. స్థానికుల ఉద్యోగ భద్రత కోసం కార్మిక శాఖ ఇప్పటికే ‘ప్రాజెక్ట్‌ ఫైౖర్‌వాల్‌’ అమల్లోకి తెచ్చింది. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులను తీసుకునే ముందు, సదరు కంపెనీ అమెరికన్‌ ఉద్యోగులను తొలగించిందో లేదో తనిఖీ చేయాలని ఈనెల 18న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

భారతీయ టెకీలపై ప్రభావం..

అమెరికా హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో అధిక శాతం భారతీయులే కావడంతో, ఈ తనిఖీల తీవ్రత భారతీయ ఐటీ రంగాన్ని, నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అమెరికా వెలుపల ఉన్న కొంతమంది హెచ్‌-1బీ ఉద్యోగుల ప్రవేశంపై ఆంక్షలను 2027 సెప్టెంబరు 21 వరకు పొడిగించారు. అలాగే కొన్ని కేటగిరీ పిటిషన్లపై ఏకంగా లక్ష డాలర్ల రుసుమును విధించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కఠిన నింబధనల వల్ల పెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్‌ కంపెనీల నుంచి వచ్చే హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే 92 శాతం పడిపోయినట్లు వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Sep 28 , 2026 | 05:33 AM