‘హెచ్-1బీ వీసా’ రద్దుకు బిల్లు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:06 AM
భారతీయ ఐటీ నిపుణులకు చేదువార్త. అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు షాకిచ్చేలా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్ స్టూబ్
వాషింగ్టన్, ఫిబ్రవరి 10: భారతీయ ఐటీ నిపుణులకు చేదువార్త. అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు షాకిచ్చేలా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను హరిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి అవకాశం కల్పించాలని, అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఈ బిల్లు చట్టంగా మారితే మాత్రం అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారత టెకీల ఆశలపై నీళ్లు చల్లినట్లే. హెచ్-1బీ వీసా పొందుతున్న వారిలో 80శాతానికి పైగా భారతీయులు, చైనీయులే ఉంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలసదారులపై ఉక్కుపాదం మోపుతన్న సంగతి తెలిసిందే. కొత్త హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుమును విధించింది. పైగా లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.