Share News

ఉద్యోగం పోతే అమెరికా వీడాల్సిందే!

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:16 AM

అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీ నిపుణులకు మరో షాక్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం..

ఉద్యోగం పోతే అమెరికా వీడాల్సిందే!

  • కొత్తకొలువు వెతుక్కోవడానికున్న 60 రోజుల గడువు రద్దుకు ట్రంప్‌ సర్కార్‌ యత్నం

  • హెచ్‌1బీ తదితర వీసాదారులపై ప్రభావం

ఇంటర్నెట్ విభాగం: అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీ నిపుణులకు మరో షాక్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులు, తాత్కాలిక వర్క్‌ వీసాలపై పనిచేసే విదేశీ నిపుణులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి లేదా దేశాన్ని విడిచి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ లభిస్తోంది. 2017 నుంచి అమల్లో ఉన్న ఈ గ్రేస్‌ పీరియడ్‌ను రద్దు చేయాలంటూ.. అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం గురువారం ప్రతిపాదించింది. దీనిపై రెండు నెలలపాటు ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అందరికన్నా ఎక్కువ ప్రభావం పడేది భారతీయ టెకీలపైనే. ఎందుకంటే హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నవారిలో సింహభాగం (70-71 శాతం) మనోళ్లే. తర్వాత 11-12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉంటారు. గ్రేస్‌ పీరియడ్‌ రద్దు కారణంగా కంపెనీలకు కొంతమేర ఇబ్బంది ఎదురవుతుందిగానీ.. ఖాళీ అయిన ఉద్యోగాలను అమెరికన్లతో భర్తీ చేయవచ్చని హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం అభిప్రాయపడింది. ఒకవేళ అదే ఉద్యోగిని కొనసాగించాలని కంపెనీలు గనక భావిస్తే ఐ-129 పిటిషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇబ్బందిపడేవారిలో హెచ్‌-1బీ వీసాదారులతోపాటు.. ఈ1 (ఇంటర్నేషనల్‌ ట్రేడర్‌), ఈ2 (వాణిజ్య వాహనాల ఆపరేటర్లు), ఎల్‌-1 (అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు), ఓ1 (సైన్స్‌, క్రీడలు, కళల్లో అసాధారణ ప్రతిభావంతులు) వీసాదారులు ఎక్కువగా ఇబ్బందిపడతారు.

Updated Date - Sep 11 , 2026 | 05:18 AM