యుద్ధం కొనసాగితే కష్టమే!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:33 AM
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధ ప్రభావం మన దేశంపై కూడా అధికంగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల చమురు,...
మనదేశంలో పెట్రో ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం
భారత్ ఎగుమతులపైనా ప్రభావం
హైదరాబాద్ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధ ప్రభావం మన దేశంపై కూడా అధికంగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల చమురు, డ్రైఫ్రూట్స్ వంటి ఉత్పత్తుల దిగుమతులకు విఘాతం కలుగుతోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రై ఫ్రూట్స్, మసాలాలు దిగుమతి అవుతుంటాయి. యుద్ధం దీర్ఘకాలంపాటు సాగితే వీటిని దిగుమతి చేసుకోవటం కష్టమవుతుంది. అప్పుడు తాత్కాలికంగానైనా నగరంలో వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అసలే రంజాన్ మాసం కావటంతో ఈ ఉత్పత్తులకు గిరాకీ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో దిగుమతులు ఆగిపోతే కష్టమేనని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇరాన్‌కు ఫార్మా ఉత్పత్తులు, వివిధ రకాల పళ్లు, బియ్యం అధికంగా ఎగుమతి అవుతుంటాయని, వాటిపై కూడా ఈ ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. నిజానికి ఇరాన్‌తో భారత్ వాణిజ్యం స్వల్పమే. ఒకప్పటిలా ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు పెద్దగా లేవని నగరానికి చెందిన వ్యాపారవేత్త శేఖర్ తెలిపారు. అమెరికా ఆంక్షలతో 2019 తరువాత ఇరాన్‌తో మన వాణిజ్యం తగ్గిపోయిందని చెప్పారు. అయితే, యుద్ధ ప్రభావం నేరుగా ఉండకపోయినా.. విమాన, నౌకాయానాలు ఆగిపోతే పరోక్షంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
యుద్ధం వల్ల పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్, వంటనూనెల ధరలు పెరిగే అవకాశముందని బేగంబజార్‌లో హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న నరేష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సీజన్‌కు తగినట్లుగా దిగుమతుల ఆర్డర్‌లు చేసినప్పటికీ.. యుద్ధం ఇలాగే కొనసాగితే ఖర్జూరం తదితర డ్రై ఫ్రూట్స్ దిగుమతి ఆలస్యమై ధరలు పెరుగుతాయని డ్రై ఫ్రూట్స్ వ్యాపారి మాజిద్ హుస్సేన్ చెప్పారు. ఈ యుద్ధం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపే అవకాశముందని నగరంలోని ఓ ఆర్థిక సేవల సంస్థలో మేనేజర్‌గా చేస్తున్న శర్మ తెలిపారు. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు మామిడి, మాంసం, ఫార్మా, ఐటీ, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. చమురు ధరలు పెరిగితే.. దాని ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని పేర్కొన్నారు. యూరియా లాంటి ఎరువుల దిగుమతలకు కూడా విఘాతం కలిగి.. రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని అన్నారు.