Share News

ఇరాన్‌ లొంగేదాకా యుద్ధం చేయండి!

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:51 AM

ఇరాన్‌పై దాడులను ముగించే దిశగా ట్రంప్‌ యోచిస్తున్న సమయంలో.. ఆ దేశం లొంగిపోయే దాకా యుద్ధం కొనసాగించాలని గల్ఫ్‌ దేశాలు కోరుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఇరాన్‌ లొంగేదాకా యుద్ధం చేయండి!

  • మాకు చెప్పకుండానే యుద్ధం ప్రారంభించారు

  • ప్రతీకార దాడుల్లో మాకు తీవ్ర నష్టం

  • ట్రంప్‌పై గల్ఫ్‌ దేశాల ఒత్తిళ్లు

దుబాయ్‌, మార్చి 31: ఇరాన్‌పై దాడులను ముగించే దిశగా ట్రంప్‌ యోచిస్తున్న సమయంలో.. ఆ దేశం లొంగిపోయే దాకా యుద్ధం కొనసాగించాలని గల్ఫ్‌ దేశాలు కోరుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈ, బహ్రెయిన్‌ ఈ విషయంలో ట్రంప్‌పై ఒత్తిళ్లు తెస్తున్నాయంటూ గల్ఫ్‌ ప్రతినిధులను ఉటంకిస్తూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. నెల రోజులుగా చేస్తున్న గగనతల యుద్ధంతో ఇరాన్‌ పెద్దగా బలహీనపడలేదని.. ఇరాన్‌ నాయకత్వంలో పూర్తిగా మార్పులు జరిగే వరకు ఆపరేషన్‌ కొనసాగాలని ఆయా గల్ఫ్‌ దేశాలు అమెరికాకు రహస్యంగా విజ్ఞప్తి చేశాయి. ఇరాన్‌పై దాడికి ముందు తమను సంప్రదించలేదని.. కానీ ఇప్పుడు ఇరాన్‌ ప్రతిదాడుల్లో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని స్పష్టం చేశాయి. చమురు, గ్యాస్‌ వ్యవస్థలతోపాటు దశాబ్దాలుగా నిర్మించుకున్న తమ భద్రమైన ఇమేజీ కూడా దెబ్బతిన్నదని గుర్తు చేశాయి. ఇప్పుడు అమెరికా యుద్ధాన్ని అర్ధంతరంగా ఆపేస్తే.. భవిష్యత్తులో తాము ఇరాన్‌ దాడులకు గురికావాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కేవలం కాల్పుల విరమణ ప్రకటించడం కాదని.. తమ భవిష్యత్తుకు పూర్తి భద్రత కావాలని కోరాయి. భూతల దాడులు చేపట్టి ఇరాన్‌ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని పూర్తిగా మార్చేయాలని ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా ఇరాన్‌ అణు, క్షిపణి కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేసేలా ఉండాలని సౌదీ అరేబియా కోరుతున్నట్టు సమాచారం.

Updated Date - Apr 01 , 2026 | 03:51 AM