ఇరాన్‌పై దాడితో గగనతలాల మూసివేత
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:17 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు.. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి.
ఎయిర్‌స్పేస్‌ను మూసివేసిన 8దేశాలు
న్యూఢిల్లీ, దుబాయి, టెహ్రాన్, ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు.. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, కువైత్, యూఏఈ, సిరియాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాకు అన్ని విమానాల రాకపోకలను ఆదివారం వరకు నిలిపివేస్తున్నట్టు శనివారం ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. ఇజ్రాయెల్ గగనతలం మూసివేసినందున ఢిల్లీ-టెల్‌అవీవ్ విమానం ముంబైకి తిరిగి వచ్చినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆదివారం యూరప్, యూఎస్, కెనడాలోని వివిధ నగరాలను కలిపే 28 విమానాలను రద్దు చేసినట్టు పేర్కొంది. అబుదాబి, దోహా, జెద్దా, కువైత్, రియాద్‌లకు తమ విమానాల రాకపోకలను మార్చి 2 వరకు నిలిపివేస్తున్నట్టు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. కాగా, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు సూచించాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైత్, ఖతార్ దేశాల గగనతలాలకు మార్చి 2వరకు దూరంగా ఉండాలని డీజీసీఏ భారత ఎయిర్ లైన్స్ సంస్థలకు సూచించింది
వేలాది మంది విమానాశ్రయాల్లోనే
గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆ ఆదేశాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రధాన హబ్‌లకు రాకపోకలు సాగించే విమానాలు రద్దవడంతో వేలాదిగా ప్రయాణికులు టెర్మినళ్ల వద్ద చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. దుబాయి విమానాశ్రయంలో ఎయిర్‌లైన్ సంస్థల డెస్క్‌ల వద్ద ప్రయాణికులు టికెట్ల రిఫండ్స్, తిరిగి బుకింగ్, ప్రాథమిక సమాచారం కోసం బారులుతీరారు. తాజా పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు సహా ఏవియేషన్ భాగస్వాముల సంసిద్ధతపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు శనివారం సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే సింధు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి, శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 28: ఇరాన్‌లో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ గల్ఫ్‌కు విమాన రాకపోకలపై ఆంక్షలను ప్రకటించడంతో విమాయాన వ్యవస్థ స్తంభించిపోయింది. ఒక్క రోజులో 834 విమానాలను రద్దు చేయగా అందులో 615 విమానాలు యూఏఈకి చెందినవే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి న్యూయార్క్, సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, నైరోబి నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ప్రతి విమానంపై ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలకు మాత్రమే కాక అమెరికా, ఐరోపా దేశాలకు భారతీయుల రాకపోకలు తాత్కాలికంగా స్తంభించిపోయాయి. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ కోసం బర్మింగ్‌హమ్ బయలుదేరిన భారత స్టార్ షట్లర్ విమాన సర్వీసు రద్దుతో దుబాయ్ విమానాశ్రయంలో ఇరుక్కుపోయారు. ఇక, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే 44 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అలాగే అదే ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.