దాడుల దృశ్యాలను చిత్రీకరించొద్దు
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:45 AM
స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో......
గల్ఫ్‌లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణపై నిషేధం
దుబాయ్ పోలీసుల అదుపులో ఇందూరు వాసి
ఖతార్‌లో 194 మంది అరెస్టు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నిబంధనలను కఠినతరం చేశాయి. స్థానిక నగరాలపై జరిగే దాడులను చిత్రీకరించవద్దని పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఏ రకమైన సమాచారాన్ని కూడా తమ వద్ద కనీసం నిల్వ కూడ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాయి. సమాచారాన్ని కేవలం అధికార వర్గాల నుండి మాత్రమే పొందాలని సూచిస్తున్నాయి. నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. స్థానిక పోలీసు నిఘా విభాగం దీనిపై పూర్తిగా దృష్టి సారించింది. సైబర్ విభాగం సహాయంతో నిబంధనలను ఉల్లంఘించిన అనేక మందిను అరెస్టు చేస్తోంది. స్ధానిక భారతీయ ఎంబసీలు కూడ ఈ విషయంలో ప్రవాసీయులు గల్ఫ్ దేశాల చట్టాలకు లోబడి వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దుబాయ్‌లో దాడులకు సంబంధించి అసత్య సమాచారాన్ని షేర్ చేసినందుకు, దృశ్యాలను చిత్రీకరించినందుకు అనేక మంది భారతీయులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పలు పోలీసు స్టేషన్లలో ఈ రకమైన కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. తాజాగా డ్రోన్ల దాడికు సంబంధించి దృష్యాన్ని ఫోన్‌లో చిత్రీకరించినందుకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామానికి చెందిన ఒక ఇంజినీర్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖతార్‌లో దాడులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసినందుకు, స్వీకరించినందుకు 194 మందిని అరెస్టు చేశారు. కువైట్, బహ్రెయిన్ దేశాల్లోనూ ఈ రకమైన అరెస్టులు జరిగాయి. ఇదిలా ఉండగా, ఖతర్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు దోహాలోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. విమాన సర్వీసుల రద్దు వలన ఖతర్‌లోనే నిలిచిపోయిన భారత పర్యాటకులు, హయ్యా ఏ1 వీసా కలిగిన షార్ట్ టర్మ్ విజిటర్లు ఆన్‌లైన్‌లో తమ వివరాలను సమర్పించాలని ఆదివారం జారీచేసిన అడ్వైజరీలో పేర్కొంది.