Share News

వెనెజువెలాలో ‘భూకంపం వస్తుంది జాగ్రత్త’.. అని గూగుల్‌ ముందే చెప్పేసింది

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:46 AM

ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ గూగుల్‌ మాత్రం భూకంపం రాబోతుందని వెనెజువెలా ప్రజలకు ముందుగానే చెప్పేసింది.

వెనెజువెలాలో ‘భూకంపం వస్తుంది జాగ్రత్త’.. అని గూగుల్‌ ముందే చెప్పేసింది

ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ గూగుల్‌ మాత్రం భూకంపం రాబోతుందని వెనెజువెలా ప్రజలకు ముందుగానే చెప్పేసింది. వెనెజువెలాలో నిమిషాల తేడాల్లో రెండు సార్లు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలు ఏర్పడడానికి కొన్ని సెకన్ల ముందు.. ఆ దేశంలోని లక్షలాది ఆండ్రాయిడ్‌ యూజర్ల మొబైల్‌ ఫోన్లు భూకంప హెచ్చరిక సందేశాలతో మోగాయి. ‘‘ మరికాసేపట్లో 6.2 తీవ్రతతో భూమి కంపించబోతుంది.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎర్త్‌ క్వేక్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ తన యూజర్లకు హెచ్చరికలు పంపింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే భూమి కంపించింది. భూకంపం రాబోతుందని గూగుల్‌ ఎలా చెప్పగలిగిందంటే... ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల్లో ఉండే యాక్సిలరో మీటర్‌ అనే సెన్సార్‌ వల్లే. మనం ఫోన్‌ను అడ్డంగా పట్టుకొని చూస్తున్నప్పుడు ఈ యాక్సిలరోమీటర్‌ వల్లే స్ర్కీన్‌ దానంతటదే తిరుగుతుంది. ఆధునిక స్మార్ట్‌ ఫోన్లు అన్నింటిలోనూ యాక్సిలరోమీటర్‌ ఉంటుంది. ఈ యాక్సిలరోమీటర్‌ వల్ల మరో ఉపయోగం ఏంటంటే.. అది ప్రకంపనలను ముందుగా అంచనా వేస్తుంది. భూకంపం వంటి ప్రకంపనలను యాక్సిలరోమీటర్‌ అంచనా వేస్తే అది వెంటనే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలెర్ట్‌ సిస్టమ్‌కు భూకంపం సంభవించే ప్రదేశం లొకేషన్‌ సహా తీవ్రతకు సంబంధించిన సిగ్నల్‌ పంపిస్తుంది. ఇలా ఒకే సమయంలో వేర్వేరు ఫోన్ల నుంచి ఈ సిగ్నల్‌ వస్తే గూగుల్‌ ఎర్త్‌క్వేక్‌ అలెర్ట్‌ సిస్టమ్‌.. వెంటనే ఆ ప్రాంతంలోని మొబైల్‌ ఫోన్లకు భూకంప హెచ్చరికలను పంపిస్తుంది. అయితే, భూకంపం రావడానికి ముందే గూగుల్‌ అంత కచ్చితంగా ఎలా అంచనా వేసిందంటే.. భూప్రకంపనలు ఒక్కసారి కుదుపులా కాకుండా తరంగాల రూపంలో సంభవిస్తాయి. తొలుత వచ్చే ప్రైమరీ వేవ్స్‌(పీ-తరంగాలు) సెకనుకు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత వచ్చే సెకండరీ వేవ్స్‌(ఎ్‌స-తరంగాలు) సెకనుకు మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. పీ తరంగాలతో పోలిస్తే ఎస్‌ తరంగాల వేగం తక్కువైనా భూకంపం వల్ల జరిగే నష్టానికి అవే కారణం. స్మార్ట్‌ ఫోనుల్లోని యాక్సిలరోమీటర్లు పీ-తరంగాలను గుర్తించిన వెంటనే గూగుల్‌ అలెర్ట్‌ సిస్టమ్‌కు సిగ్నల్స్‌ వెళ్లిపోతాయి. దాంతో పీ, సీ తరంగాల మధ్య తేడా ఉన్న సెకన్ల వ్యవధిలో మొబైల్‌ ఫోన్లకు హెచ్చరికలు వచ్చేస్తాయి. ఇదే వ్యవస్థ వెనెజువెలాలోని ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా ముందస్తు హెచ్చరికలు పంపించింది. ఆ తర్వాత సెకన్ల వ్యవధిలోనే భూమి కంపించి తీవ్ర నష్టం కలిగించింది. కానీ కొన్నిసార్లు ఈ సెకన్ల సమయమే ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడతుందని నిపుణులు అభిపాయపడుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 03:46 AM