వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి..వారి స్థానంలో 50 రోబోల నియామకం
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:18 AM
అమెరికాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్.. డెట్రాయిట్‌లోని తన విద్యుత్తు కార్ల తయారీ ప్లాంట్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి...
అమెరికా సంస్థ జనరల్ మోటార్స్ చర్య
న్యూయార్క్, జూన్ 22: అమెరికాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్.. డెట్రాయిట్‌లోని తన విద్యుత్తు కార్ల తయారీ ప్లాంట్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో 50 రోబోలను నియమించింది. ఈ రోబోలను ‘కొలాబరేటివ్ రోబోస్ (కోబోస్)’ అంటున్నారు. డెట్రాయిట్, హామ్‌ట్రాంక్ నగరాల సరిహద్దులో ఈవీ కార్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను జనరల్ మోటార్స్ సంస్థ ‘ఫ్యాక్టరీ జీరో’గా వ్యవహరిస్తోంది. ‘ప్రమాదాలు లేని, కాలుష్యం లేని, ట్రాఫిక్ ఇబ్బందులు లేని (జీరో క్రాషెస్, జీరో ఎమిషన్స్, జీరో కంజెషన్)’ భవిష్యత్తే లక్ష్యంగా పూర్తిగా విద్యుత్తు కార్లనే (హమ్మర్ ఈవీ, సిల్వరాడో ఈవీ వంటివాటిని) తయారుచేస్తోంది. అయితే, ఆ కంపెనీ ఊహించిన స్థాయిలో ఈవీలకు గిరాకీ పెరగకపోవడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికితోడు చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ కార్లతో తీవ్రస్థాయిలో పోటీ పడాల్సిన పరిస్థితి. దీనివల్ల ఈ ప్లాంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టిన జీఎం సంస్థపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవడానికి ఆ సంస్థ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ‘కోబో’లను ప్రవేశపెట్టింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అమెరికా, కెనడాల్లో కార్ల తయారీ కంపెనీల్లోని కార్మికులకు ప్రాతినిధ్యం వహించే అతి పెద్ద కార్మిక యూనియన్ ‘యునైటెడ్ ఆటో వర్కర్స్’.. ఈ చర్యను కార్మికుల పట్ల నమ్మకద్రోహంగా అభివర్ణించింది. ఈ నిర్ణయం పట్ల తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని ఆ యూనియన్ నేత జేమ్స్ కాటన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.