Share News

పొంచి ఉన్న ఇంటర్నెట్‌ సంక్షోభం!

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:57 AM

ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచంలో చమురు, వంటగ్యాస్‌ సంక్షోభం నెలకొంది. దీనికి తోడుగా ఇంటర్నెట్‌ సంక్షోభమూ ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొంచి ఉన్న ఇంటర్నెట్‌ సంక్షోభం!

  • హోర్ముజ్‌ జలసంధి, ఎర్రసముద్రం గర్భంలో 21 ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ వ్యవస్థలు

వాషింగ్టన్‌, మార్చి 19: ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచంలో చమురు, వంటగ్యాస్‌ సంక్షోభం నెలకొంది. దీనికి తోడుగా ఇంటర్నెట్‌ సంక్షోభమూ ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌లో సమాచార బదిలీకి అవసరమైన ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు సముద్రగర్భం గుండా ప్రపంచమంతటా వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటి నుంచే ఈ మెయిళ్లు, వీడియోకాల్స్‌, బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఏఐ సర్వీసులు వంటి సమ స్తం నడుస్తుంటాయి. డిజిటల్‌ ప్రపంచానికి ఇవి రక్తనాళాల వంటివి. ఈ కేబుళ్లలో కొంత భాగం.. హోర్ముజ్‌ జలసంధి, ఎర్రసముద్రంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ పశ్చిమాసియా యుద్ధంలో కీలక ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఇరాన్‌ తన సమీపంలోని హోర్ముజ్‌ జలసంధిని దాదాపుగా మూసివేసి, తనకు అనుకూల దేశాల నౌకలను మాత్రమే ఆ మార్గంలో వెళ్లటానికి అనుమతిస్తోంది. ఇక ఎర్రసముద్రంలోని బాబ్‌ ఎల్‌ మందెబ్‌ ప్రాంతం యెమెన్‌లోని ఇరాన్‌ అనుకూల హౌతీ సాయుధ గ్రూపుల పరిధిలో ఉంది. యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ రెండు ప్రాంతాల్లో సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్‌ కేబుళ్లను ఇరాన్‌ సైన్యం, హౌతీలు ధ్వంసం చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది.

నిలిచిపోయిన కేబుళ్ల మరమ్మతులు

ఎర్ర సముద్రంలో కనీసం 21 సంస్థల కేబుల్‌ వ్యవస్థలు ఉన్నాయని ‘కెపాసిటీ గ్లోబల్‌’, ‘టెలిజాగ్రఫీ’ వంటి అంతర్జాతీయ టెలికం, డాటాసెంటర్‌ వెబ్‌సైట్లు వెల్లడించాయి. యూరప్‌, ఆసియా, ఆఫ్రికా దే శాల ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌కు ఇవి అత్యంత కీలకమైనవి. ఇక హొర్ముజ్‌ జలసంధిలో టాటా-టీజీఎన్‌ గల్ఫ్‌ సంస్థతోపాటు మరో మూడు సంస్థల కేబుళ్లున్నాయి. టాటా-టీజీఎన్‌ గల్ఫ్‌ కేబుళ్లు ముంబైని గల్ఫ్‌తో అనుసంధానిస్తాయి. వీటిలో ఎలాంటి అంతరాయం తలెత్తినా.. భారత్‌తోపాటు పలు దేశాల వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కేబుళ్లలో తలెత్తే మరమ్మతు లు, నిర్వహణ వంటి ప్రక్రియలు కూడా నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టటానికి నిపుణులు నౌక ల్లో ఆయా కేబుళ్ల వద్దకువెళ్లి వాటిని సరిచేస్తుంటారు. ప్రస్తుతం ఇరాన్‌.. హొర్ముజ్‌ జలసంధిలో అనేక చోట్ల సముద్ర మందుపాతరలను అమర్చింది. దీంతో అటువైపు మరమ్మతుల నౌకలు వెళ్లే పరిస్థితి లేదని టెలి జియాగ్రఫీకి చెందిన అలెన్‌ మౌల్దిన్‌ వెల్లడించారు.

Updated Date - Mar 20 , 2026 | 04:57 AM