హోర్ముజ్ నుంచి ఒక్కరోజే 1.90కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:34 AM
అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన దౌత్యపర ఒప్పందం సత్ఫలితాలు ఇస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీని ద్వారా రెండు విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు.
వాషింగ్టన్, జూన్ 23: అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన దౌత్యపర ఒప్పందం సత్ఫలితాలు ఇస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీని ద్వారా రెండు విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు. నౌకాయానానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం ఒకటైతే, అణు ఇంధన వనరుల తనిఖీకి ఇరాన్ అంగీకరించడం రెండోదని వివరించారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. హోర్ముజ్ జలసంధి ద్వారా సోమవారం ఒక్క రోజే 1.90 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని తెలిపారు. ఇది రికార్డు అని, గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో రవాణా జరగలేదని పేర్కొన్నారు. అణు ఇంధన వనరులను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ తనిఖీ చేసేందుకు ఇరాన్ సంపూర్ణంగా అంగీకరించిందని కూడా వెల్లడించారు. కానీ, దీన్ని ఇరాన్ ఖండించింది. ఇదిలా ఉండగా, ఒప్పందం కుదిరినప్పటి నుంచి హోర్ముజ్ నుంచి 12 నౌకలు భారత్‌కు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.