Share News

బద్ధ శత్రువులుగా ఒకనాటి మిత్రులు

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:05 AM

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వం పశ్చిమాసియాను మరోసారి తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.

బద్ధ శత్రువులుగా ఒకనాటి మిత్రులు

  • 1979కి ముందు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య స్నేహం.. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవంతో మారిన పరిస్థితి

  • ఇజ్రాయెల్‌ను శత్రువుగా ప్రకటించిన ఇరాన్‌

  • ఇరాన్‌తో తన మనుగడకే ముప్పు ఉందని ఇజ్రాయెల్‌ భావన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వం పశ్చిమాసియాను మరోసారి తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఇరాన్‌ను అణచివేసేందుకు ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌ పేరుతో ఇజ్రాయెల్‌ శనివారం నుంచి దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్‌ కూడా ప్రతి దాడులు చేస్తోంది. అయితే, ఈ దేశాల మధ్య మొదటి నుంచి శత్రుత్వం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ సంబంధాలు మామూలుగానే ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ఈ దేశాలు నాడు మంచి మిత్రులు. 1979కి ముందు ఇరాన్‌ను పాలించిన రాజు మొహమ్మద్‌ రెజా షా పహ్లవీ.. ఇజ్రాయెల్‌, అమెరికాతో మంచి సంబంధాలు నెలకొల్పారు. నాడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌ క్షిపణులను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలుండేవి. ఇరాన్‌ రాజుకు అమెరికా నుంచి అన్ని విషయాల్లో మద్దతు లభించేంది.


ఇస్లామిక్‌ విప్లవంతో పరిస్థితి తలక్రిందులు

ఇరాన్‌లో చమురు నిల్వలపై 1950-60ల్లో అమెరికా సహా పశ్చిమ దేశాల గుత్తాధిపత్యం పెరగటం, 1979లో సంభవించిన ఇస్లామిక్‌ విప్లవంతో ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. అయతొల్లా రొహొల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్‌లో 1979లో ఇస్లామిక్‌ తిరుగుబాటు సంభవించింది. దీంతో రాజు రెజా పహ్లవీ దేశం విడిచి పారిపోయాడు. దేశానికి సర్వాధికారిగా మారిన ఖమేనీ.. ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా ప్రకటించారు. ఇరాన్‌లో అమెరికా సహా పశ్చిమదేశాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు. 1979 నవంబరులో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి 52 మంది అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకున్నారు. దీంతో అమెరికా కూడా ఇరాన్‌కు శత్రువుగా మారిపోయింది.

అణు భయాలతో మరింత శత్రుత్వం

1980ల తర్వాత ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి దిగజారింది. ఇరాన్‌ అణుబాంబును తయారు చేస్తోందని ఇజ్రాయెల్‌ ఆరోపించటం, అరబ్‌ దేశాల్లో ఇరాన్‌ తన ప్రాభవాన్ని పెంచుకొనేందుకు హెజ్బొల్లా, హమాస్‌, ఇతర మిలీషియా గ్రూపులను పెంచి పోషించటంతో రెండు దేశాల మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని దెబ్బ తీసేందుకు ఆ దేశ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌ చంపివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెబనాన్‌లో హెజ్బొల్లాను, గాజాలో హమా్‌సను, ఇరాక్‌-సిరియాల్లో స్థానిక మిలీషియా గ్రూపులను ఇరాన్‌ రెచ్చగొట్టి తమపైకి దాడులకు ఉసిగొల్పుతోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. పరిస్థితి విషమించి గత ఏడాది జూన్‌ 13 నుంచి 24 వరకు 11 రోజులపాటు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్‌, సౌదీ, ఖతార్‌ వంటి వాటికి ఇరాన్‌ నుంచి ముప్పు ఉందని ఆరోపిస్తూ అమెరికా కూడా ఆ దేశాన్ని నియంత్రించేందుకు బలప్రయోగానికి దిగుతోంది. హార్ముజ్‌ జలసంధి ద్వారా చమురు సరఫరాను ఇరాన్‌ అడ్డుకోకుండా కాపాడటం కూడా ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవటానికి ఒక కారణం.

Updated Date - Mar 01 , 2026 | 03:07 AM