Share News

అవును.. కూల్చాలనుకున్నా

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:32 AM

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానాన్ని కూల్చివేయాలనుకున్నానని కో-పైలట్‌ అల్‌హమ్మామీ అంగీకరించాడు.

అవును.. కూల్చాలనుకున్నా

  • నాకు చావంటే భయం లేదు.. విచారణలో కో-పైలట్‌ హమ్మామీ

  • ప్రార్థన చేసుకుంటానని వెళ్లి వెనక నుంచి గొడ్డలితో దాడి చేశాడు

  • కాక్‌పిట్‌ తలుపు తెరిచినా మూసేశాడు.. మళ్లీ దాడి చేయడంతో కిందపడ్డా

  • ఎలాగోలా మళ్లీ తలుపు తెరిచి అరిచా.. నెతన్యాహుతో చెప్పిన మచ్చార్‌

  • క్షణాల్లో వేల అడుగులు కిందికి జారిపోవడంతో దెబ్బతిన్న విమానం రడ్డర్‌

  • ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం అదృష్టమేనంటున్న నిపుణులు

  • ఇలాంటి దాడులు మరిన్ని చేయాలి: అల్‌ఖైదా

దుబాయ్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 4: దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానాన్ని కూల్చివేయాలనుకున్నానని కో-పైలట్‌ అల్‌హమ్మామీ అంగీకరించాడు. తనకు మరణం అంటే ఏమాత్రం భయం లేదని పేర్కొన్నాడు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారన్నది మాత్రం చెప్పలేదు. విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాక, కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన సౌదీ అధికారులు ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. యూఏఈలోని అబుధాబిలో సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్‌ అధికారులు హమ్మామీని ప్రశ్నిస్తున్నారు. అతడికి అంతర్జాతీయ ఉగ్రముఠాలతోగానీ, ఇరాన్‌తోగానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హమ్మామీ తీవ్ర మతవాది అని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని, ఇళ్లలోనే ఉండాలని పోస్టులు పెట్టేవాడని గుర్తించారు.


ప్రార్థన చేసుకుంటానని వెళ్లి..

కో-పైలట్‌ హమ్మామీ ప్రార్థన చేసుకుంటానని వెళ్లి, వెనుక నుంచి తన తలపై గొడ్డలితో దాడి చేశాడని స్మిత్‌ మచ్చార్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో వీడియోకాల్‌ మాట్లాడిన సందర్భంలో వెల్లడించారు. ‘‘ఆ ప్రాంత పైలట్లు అలా ప్రార్థన చేసుకోవడం సాధారణమే కావడంతో నేను అడ్డుచెప్పలేదు. అయితే, నాలుగైదు నిమిషాల తర్వాత కాక్‌పిట్‌లోని గొడ్డలి తీసుకుని హమ్మామీ నా తలపై వరుసగా కొట్టడంతో చూపు మసకబారింది. కొన్ని క్షణాలు ఏం జరుగుతోందో తెలియలేదు. అదే సమయంలో విమానం కిందికి జారిపోతున్నట్టు అనిపించింది. వెళ్లి కాక్‌పిట్‌ తలుపు తెరిచా. కానీ కో-పైలట్‌ వచ్చి మళ్లీ నాపై గొడ్డలితో దాడి చేసి, తలుపు మూసేశాడు. నేను కిందపడిపోయా. చనిపోతానని అనిపించింది. మరోసారి శక్తినంతటినీ కూడదీసుకుని తలుపు తెరిచి సాయం కోసం అరిచా. గొడవను విని అప్పటికే తలుపు దగ్గరికి చేరుకున్న ప్రయాణికులు కాక్‌పిట్‌ లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను బయటికి లాక్కొచ్చి బంధించారు’’ అని స్మిత్‌ మచ్చార్‌ వివరించారు.


అత్యంత వేగాన్ని తట్టుకుని ల్యాండింగ్‌!

కో-పైలట్‌ కూల్చివేయాలనుకున్న విమానం బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 సిరీ్‌సకు చెందినది. ఘటన జరిగిన సమయంలో దాదాపు 40 డిగ్రీల కోణంలో విమానం కిందికి జారిపోయింది. కేవలం ఒకటిన్నర నిమిషాల్లో 17 వేల అడుగులు (సుమారు 4.5 కిలోమీటర్లు) కిందకు వచ్చింది. ఆ సమయంలో విమానం 0.96 మ్యాక్‌ (1 మ్యాక్‌ అంటే శబ్దవేగానికి సమానం) వేగంతో ప్రయాణించి ఉంటుందని ‘ఫ్లైట్‌ రాడార్‌24’ అంచనా వేసింది. నిజానికి ఈ తరహా విమానం గరిష్ఠంగా 0.82 మ్యాక్‌ వేగాన్ని మాత్రమే తట్టుకోగలదు. మించితే విమానం దెబ్బతింటుంది. ఇక అంత వేగంగా పడిపోతున్న సమయంలో విమానంపై, అందులోని ప్రయాణికులపై గురుత్వాకర్షణ శక్తి (జీ ఫోర్స్‌)తో పోలిస్తే.. మూడింతలకుపైగా (3.08 జీఫోర్స్‌) ఒత్తిడి పడింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు గరిష్ఠంగా 2.5 జీఫోర్స్‌ను మాత్రమే తట్టుకోగలవు. ఈ క్రమంలో విమానం ప్రయాణ సమయంలో దిశను మార్చుకునేందుకు ఉపయోగించే తోకపైభాగంలోని రడ్డర్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. అది సరిగా లేకుంటే విమానం దిశమార్చడం, ల్యాండింగ్‌ చేయడం చాలా కష్టం. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విమానంలోని ఇతర ఆఫ్‌డ్యూటీ పైలట్లు దానిని సురక్షితంగా ల్యాండ్‌ చేయగలగడం, ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడటం అదృష్టమేనని నిపుణులు చెబుతున్నారు.


ఇలాంటి దాడులు చేయాలి: అల్‌కాయిదా

ఇజ్రాయెల్‌ పౌరులున్న విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్‌ అల్‌హమ్మామీకి మద్దతుగా అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లపై 9/11 దాడులను, తాజా అల్‌హమ్మామీ చేసిన ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఇంకా యుద్ధం ముగియలేదు. ఇస్లామ్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెలీలు, అమెరికన్లు, వారి తొత్తులు ఇంకా ఆకాశంలో తిరుగుతూనే ఉన్నారు. ఆ విమానాలను కూల్చేయడం, వాటిని హైజాక్‌ చేసి దాడులు చేయడం వంటివి చేపట్టాలి’’ అని పిలుపునిచ్చింది. అమెరికా దుష్ట సామ్రాజ్యం అంతమయ్యే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొంది.

Updated Date - Oct 05 , 2026 | 05:33 AM