Share News

ఆ కో-పైలట్‌కు ఉగ్ర భావజాలం

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:14 AM

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ దాడి ఉగ్రవాద చర్యేనని నిర్ధారించినట్లు యూఏఈ ప్రకటించింది.

ఆ కో-పైలట్‌కు ఉగ్ర భావజాలం

  • ఒమన్‌ వాస్తవ్యుడు.. ఉగ్ర భావజాలం కారణంగా అక్కడ విమానాలు నడపకుండా నిషేధం

  • కొన్నాళ్లు మొరాకో ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం

  • 8 నెలల క్రితమే ‘ఫ్లైదుబాయ్‌’లో చేరిక

  • కాక్‌పిట్‌లోని ‘గొడ్డలి’తోనే పైలట్‌ మచ్చార్‌పై దాడి

  • మచ్చార్‌కు యూఏఈ యువరాజు పరామర్శ

న్యూఢిల్లీ/దుబాయ్‌, అక్టోబరు 3: దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో కో-పైలట్‌ దాడి ఉగ్రవాద చర్యేనని నిర్ధారించినట్లు యూఏఈ ప్రకటించింది. విమానాన్ని కూల్చివేయడానికి కుట్ర చేశాడని అధికారికంగా వెల్లడించింది. కో-పైలట్‌ వివరాలను అధికారికంగా ప్రకటించకున్నా.. అధికార వర్గాల ద్వారా అతడి వివరాలు శనివారం బహిర్గతమయ్యాయి. ఇజ్రాయెల్‌, యూఏఈ అధికారవర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. ఆ కో-పైలట్‌ను ఒమన్‌కు చెందిన హమామ్‌ అల్‌హమ్మామీగా గుర్తించారు. యూఏఈలోనే జన్మించిన అల్‌హమ్మామీ తండ్రి ఒమన్‌కు చెందినవారు, తల్లి సిరియా జాతీయురాలు. చిన్నతనంలో యూఏఈలోనే గడిపిన అల్‌హమ్మామీ తర్వాత కుటుంబం వెంట ఒమన్‌కు వెళ్లిపోయాడు. కొంతకాలం సిరియాలో ఉన్నాడని, ఆ సమయంలోనే ఉగ్రభావజాలానికి ఆకర్షితుడై ఉంటాడని భావిస్తున్నారు. అల్‌హమ్మామీ యూకేలోని బకింగ్‌హమ్‌ న్యూ యూనివర్సిటీ నుంచి దూరవిద్య విధానంలో మూడేళ్ల ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాడని.. ఆ సమయంలో ఎలాంటి పైలట్‌ శిక్షణ పొందలేదని అధికారులు వెల్లడించారు.

Untitled-3 copy.jpg


తొలి నుంచీ వివాదాస్పద ప్రవర్తనే..

అల్‌హమ్మామీ ప్రవర్తన తొలి నుంచీ వివాదాస్పదమే. 2024లో ఒమన్‌ జాతీయ విమానయాన సంస్థ ‘ఒమన్‌ ఎయిర్‌’లో ట్రైనీ పైలట్‌గా చేరాడు. కొంత శిక్షణ తీసుకున్నాడు. కానీ అతడి ఉగ్రవాద భావజాలం కారణంగా ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధించి, పరిపాలనా విభాగంలో విధులు అప్పగించారు. ఈ క్రమంలో ఒమన్‌ ఎయిర్‌ సంస్థ నుంచి బయటికి వచ్చిన అల్‌హమ్మామీ.. గత ఏడాది ఫిబ్రవరిలో మొరాకో రాయల్‌ ఎయిర్‌ సంస్థలో చేరి 4నెలలపాటు కో-పైలట్‌గా పనిచేశాడు. జూన్‌లో యూఏఈకి చెందిన ఫ్లైదుబాయ్‌ విమానయాన సంస్థలో చేరాడు. అందులోనూ ఇజ్రాయెల్‌-యూఏఈ మధ్య అత్యంత సున్నితమైన మార్గంలో కో-పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నిజానికి చాలా గల్ఫ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌కు దౌత్య సంబంధాలు లేవు. యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాల్లో ఆయా దేశాల పైలట్లు ఉండటంపై నిషేధం ఉంది. అలాంటిది అల్‌హమ్మామీ ఎలా కో-పైలట్‌గా వచ్చాడనే దానిపై విచారణ జరుపుతున్నారు.


కాక్‌పిట్‌లోని ‘అత్యవసర గొడ్డలి’తోనే దాడి

విమానాన్ని కూల్చివేసే క్రమంలో తనను అడ్డుకున్న పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై కో-పైలట్‌ అల్‌హమ్మామీ కాక్‌పిట్‌లో ఉండే ‘అత్యవసర గొడ్డలి’తోనే దాడి చేశాడని యూఏఈ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హమద్‌ సైఫ్‌ అల్‌ షమ్సీ శనివారం వెల్లడించారు. యూఏఈ నేతృత్వంలో జరుగుతున్న విచారణలో సౌదీ, ఇజ్రాయెల్‌ దర్యాప్తు అధికారులు కూడా పాల్గొననున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలు రక్షించిన ఫ్లైదుబాయ్‌ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ ధైర్యానికి గుర్తింపుగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ కోటి రూపాయలు నజరానా ప్రకటించింది. మరోవైపు, స్మిత్‌ మచ్చార్‌కు శౌర్య పురస్కారం లేదా పౌర పురస్కారం ఇవ్వాలని భారత పైలట్ల సంఘం శనివారం ప్రధాని మోదీకి లేఖ రాసింది.


మచ్చార్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని ఆహ్వానం

పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ ఇజ్రాయెల్‌, భారత్‌తో పాటు ఈ ప్రపంచానికి హీరో అని ఇజ్రాయెల్‌ ప్రధా ని నెతన్యాహు ప్రశంసించారు. మచ్చార్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈసారి ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరై.. దివిటీని వెలిగించాలని ఆహ్వానించారు.

మచ్చార్‌ను పరామర్శించిన దుబాయ్‌ యువరాజు

అబుధాబిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ మచ్చార్‌ను దుబాయ్‌ యువరాజు (క్రౌన్‌ ప్రిన్స్‌) అల్‌ మక్తూమ్‌ శనివారం పరామర్శించారు. మచ్చార్‌ చూపిన ధైర్యం, నిబద్ధతను ప్రశంసించారు. తమ తరఫున, తమ దేశం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మచ్చార్‌ తమ బృందంలో, తమ దేశంలో భాగమని చెప్పారు. కాగా, మచ్చార్‌కు అత్యుత్తమమైన చికిత్స అందుతోందని, ఆయన కోలుకుంటున్నారని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

Updated Date - Oct 04 , 2026 | 07:01 AM