Share News

Reza Pahlavi: ఇరాన్‌లో రెజాపహ్లవి నామస్మరణ

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:45 AM

ఇరాన్‌లో ఇస్లామిక్‌ మతపెద్ద పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న తీవ్రమైన ప్రజా తిరుగుబాటులో మాజీ యువరాజు రెజాపహ్లవి కేంద్ర బిందువుగా మారుతున్నారు.

Reza Pahlavi: ఇరాన్‌లో రెజాపహ్లవి నామస్మరణ

టెహ్రాన్‌, జనవరి 14: ఇరాన్‌లో ఇస్లామిక్‌ మతపెద్ద పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న తీవ్రమైన ప్రజా తిరుగుబాటులో మాజీ యువరాజు రెజాపహ్లవి కేంద్ర బిందువుగా మారుతున్నారు. 17 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి, అప్పటి నుంచి అక్కడే ఉంటున్న 65 ఏళ్ల రెజాపహ్లవి.. సొంత దేశంలో ప్రజా తిరుగుబాటును మరింత ఎగదోస్తున్నారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను కూలదోస్తే.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ దిశను చూపేందుకు సిద్ధమని ప్రకటించారు. విప్లవకారుల్లో కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. రెజాపహ్లవి 1960 అక్టోబర్‌ 31న టెహ్రాన్‌లో జన్మిచారు. ఏడేళ్ల వయసులో ఆయనను యువరాజుగా ప్రకటించారు. 17 ఏళ్ల వయసులో ఫైటర్‌ పైలట్‌ శిక్షణ కోసం ఆయన అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని రీస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం వచ్చి ఆయన తండ్రి, ఇరాన్‌ రాజు మొహమ్మద్‌ రెజాపహ్లవి పదవీచ్యుడై దేశం వీడాల్సి వచ్చింది. దీంతో రెజాపహ్లవి తిరిగి స్వదేశం రాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష వర్గం రెజాపహ్లవి తిరిగి స్వదేశం రావాలని చాలాకాలంగా కోరుతోంది. ఆయన కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. గత 12 నెలల్లో ఆయన పొలిటికో వార్తా సంస్థకు ఇచ్చిన మూడు ఇంటర్వ్యూల్లో ఖమేనీ పాలనను ఎలా కూలదోయవచ్చో వివరించారు. తాజా ప్రజా తిరుగుబాటుకు ఆ ఇంటర్వ్యూలు కూడా కొంత కారణ మని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Jan 15 , 2026 | 04:46 AM