Share News

ట్రంప్‌కు యూరప్‌ బానిస కాదు

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:26 AM

గ్రీన్‌లాండ్‌ను బలవంతంగానైనా ఆక్రమించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా యూరప్‌ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపించాయి.

ట్రంప్‌కు యూరప్‌ బానిస కాదు

  • గ్రీన్‌లాండ్‌ అంశంలో మాదంతా ఒక్కటే మాట

  • ఫ్రాన్స్‌, జర్మనీ, డెన్మార్క్‌, బ్రిటన్‌, బెల్జియం ప్రకటన

  • ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్‌పై ఫైర్‌

  • బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు

  • అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు

  • అడ్డూ, అదుపు లేని సుంకాలను ఒప్పుకొనే ప్రసక్తే లేదు

  • మన వద్ద కూడా బలమైన ఆయుఽధం ఉంది

  • ఇతర దేశాలు యూరప్‌ మార్కెట్లలోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం.. ట్రేడ్‌ బజూకాను వాడుదాం: మేక్రాన్‌

  • ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు

  • పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు

  • ఇది ఎంతో కాలం కొనసాగదు: కెనడా ప్రధాని కార్నీ

  • మా మీద పన్నులు వేయండి.. 24 దేశాల సంపన్నుల లేఖ

దావోస్‌, జనవరి 21: గ్రీన్‌లాండ్‌ను బలవంతంగానైనా ఆక్రమించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా యూరప్‌ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపించాయి. స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (డబ్ల్యూఈఎ్‌ఫ)ను అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్‌ గీత దాటితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరిక జారీచేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, ఆ దేశ ఎంపీ ఎడ్‌ డేవీ, జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్‌ క్లింగ్‌బీల్‌, డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ ప్రధానులు మెట్టీ ఫ్రెడరిక్‌సెన్‌, జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌, యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌ తదితరులు కూడా ట్రంప్‌ విధానాలను తీవ్రంగా ఖండించారు. యూరప్‌ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌కు యూరప్‌ బానిస కాదని బెల్జియం ప్రధానమంత్రి బార్ట్‌ డె వీవర్‌ దావో్‌సలో తేల్చి చెప్పారు. మార్క్‌ కార్నీ ప్రసంగానికి సభికులంతా లే చి నిలబడి చప్పట్లు కొట్టారు.


సామ్రాజ్యవాదం పెరుగుతోంది: మేక్రాన్‌

ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాలకు సామ్రాజ్యవాద కోరికలు మళ్లీ పెరుగుతున్నాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ విమర్శించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మనం బెదిరిర చేవాళ్లకు, క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరప్‌ విధానాలను తూర్పారబట్టారు. ‘2024లో 60 యుద్ధాలు జరిగాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ధ్వంసం చేస్తున్నారు. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. సహకారం, భాగస్వామ్యం లేని ప్రపంచం తీవ్రమైన పోటీకి దారితీస్తుంది. సమస్య సద్దుమణిగిందని అనుకోవద్దు. ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో అమెరికా డిమాండ్లు యూర్‌పను బలహీనపర్చి, ఆశ్రిత పక్షంగా ఉండేలా చేసేందుకే. అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకొనే ప్రసక్తే లేదు. యూరప్‌ వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. అదే ట్రేడ్‌ బజూకా (ఇతర దేశాలు యూరప్‌ మార్కెట్లలోకి ప్రవేశించటాన్ని కఠినతరం చేసే విధానం). మనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నవారిపై దీనిని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో యూరప్‌ వెనక్కు తగ్గొద్దు’ అని సూచించారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్‌ ప్రకటించిన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో చేరబోమని కూడా ఫ్రాన్స్‌ అధికారులు ప్రకటించారు.

రూల్స్‌ పాటిస్తే సురక్షితంగా ఉంటామన్న గ్యారెంటీ లేదు: కార్నీ

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు పాటిస్తే సురక్షితంగా ఉంటామన్న గ్యారెంటీ చిన్న, బలహీన దేశాలకు లేదని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆందోళన వ్యక్తంచేశారు. డబ్ల్యూఈఎ్‌ఫలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఇప్పుడు పరిణామ దశలో కాకుండా ఒక చీలిక మధ్యలో ఉన్నాం. పాత పరిస్థితులు మళ్లీ రావు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతా నడుస్తుందని అనుకోవటం తప్పు అని మనకు అర్థమైంది. బలవంతులు తమ అవసరాల కోసం ఈ చట్టాల నుంచి తమను తాము మినహాయించుకుంటున్నారు. ఒక పద్ధతి అంటూ లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతోకాలం కొనసాగదు. శక్తిమంతమైన దేశాలు ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకొంటున్నాయి’ అని ఆరోపించారు. గ్రీన్‌లాండ్‌ విషయంలో డెన్మార్క్‌కు ఆయన మద్దతు ప్రకటించారు.


ట్రంప్‌ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌

ట్రంప్‌ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా మారి తన కు ఇష్టమైనవన్నీ లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారని బ్రిటన్‌ ఎంపీ ఎడ్‌ డేవీ ఆ దేశ పార్లమెంటు లో విమర్శించారు. మిత్రదేశాలపై ట్రంప్‌ సుంకా లు విధించటం సరికాదని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మన్‌ అన్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్‌ ప్రకటన అంతర్జాతీయ చట్టాలను ప్రమాదంలో పడేసిందని గ్రీన్‌లాండ్‌ ప్రధా ని జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌ విమర్శించారు. ‘మనముందు ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణమైనవి. మనం వివాదాలు కోరుకోవటం లేదు. స్థిరమైన సహకారాన్నే ఆశిస్తున్నాం’ అని డెన్మార్క్‌ ప్రధాని మెట్టీ ఫ్రెడరిక్‌సెన్‌ స్పష్టంచేశారు. ఈయూ పార్లమెంటులో డెన్మార్క్‌ సభ్యుడు ఆండ్రెస్‌ విస్టిసెన్‌.. ఏకంగా ట్రంప్‌ను బూతులు తిట్టారు. బ్లాక్‌మెయిల్‌కు లొంగబోమని జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్‌ క్లింగ్‌బీల్‌ స్పష్టంచేశారు. వాణిజ్యాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం మంచిది కాదని యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా సూచించారు.

Updated Date - Jan 22 , 2026 | 03:26 AM