EU: అమెరికాపై ఈయూ ట్రేడ్ బజూకా?
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:28 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై విధించిన 10శాతం ‘గ్రీన్‌లాండ్ టారిఫ్’పై మండిపడుతున్న యూరప్ దేశాలు..
ట్రంప్ విధించిన ‘గ్రీన్‌లాండ్ టారిఫ్’పై మండిపాటు.. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు వేసే చాన్స్
యూరప్ దేశాల్లో అమెరికా పెట్టుబడులకు అడ్డుకట్ట.. ఎల్లుండి నిర్వహించే భేటీలో నిర్ణయం
లండన్, జనవరి 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై విధించిన 10శాతం ‘గ్రీన్‌లాండ్ టారిఫ్’పై మండిపడుతున్న యూరప్ దేశాలు.. అందుకు ప్రతిగా అమెరికాపై ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్ సుముఖంగా ఉండగా.. జర్మనీ మాత్రం దాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయకుండా ఆచితూచి వ్యవహరించాలని, అమెరికాను భయపెట్టే ఆయుధంగా దాచి ఉంచాలని వాదిస్తోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా వాణిజ్య యుద్ధాల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాను ట్రంప్‌తో వ్యక్తిగతంగా మాట్లాడానని.. ‘మీరు చేస్తున్నది తప్పు’ అని కూడా చెప్పానని స్టార్మర్ తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ దేశాలపై ట్రంప్ 10శాతం అదనపు సుంకాలను ట్రంప్ ప్రకటించారు. జూన్ నుంచి ఈ అదనపు సుంకాలను 25శాతానికి పెంచుతామని.. గ్రీన్‌లాండ్ అమెరికా ఆధీనంలోకి వచ్చే వరకు సుంకాలు కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు (ట్రంప్ ప్రకటించిన గ్రీన్‌లాండ్ టారి్‌ఫతో ఈయూ దేశాలపై సుంకాలు ఫిబ్రవరి1 నుంచి 25 శాతానికి, జూన్‌తర్వాత 40శాతానికి పెరుగుతాయి). ఈ నేపథ్యంలోనే.. అమెరికాపై ట్రేడ్ బజూకాను ప్రయోగించాల్సిందిగా ఈయూకు విజ్ఞప్తి చేస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇప్పటికే ప్రకటించారు. ఏమిటీ ట్రేడ్ బజూకా?
సుంకాల విధింపు, పెట్టుబడులను అడ్డుకోవడం, సేవల నిలిపివేత వంటి చర్యలతో ఇతర దేశాలు ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చి, రాజకీయ నిర్ణయాలను తీసుకునేలా యూరప్ దేశాలను బలవంతం చేసిన సందర్భాల్లో బలంగా ప్రతిఘటించడానికి, అటువంటి ఒత్తిళ్లపై పోరాడడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక కొత్త, శక్తిమంతమైన ఆర్థిక, వాణిజ్య విధానాన్ని రూపొందించుకున్నాయి. దానిపేరు ‘యాంటీ కొయెర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ (ఏసీఐ)’. దీన్నే ‘ట్రేడ్ బజూకా’గానూ వ్యవహరిస్తున్నారు. 2023 చివరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ‘పాలిటిక్స్ కోసం ఎకనమిక్స్‌ను వాడే’ దేశాలపై ఈయూ ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధమది.
‘ట్రేడ్ బజూకా’ ఎలా పనిచేస్తుంది?
తమపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనపు సుంకాలు విధించడానికి
అమెరికన్ కంపెనీలేవీ ఈయూ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందకుండా నిలువరించడానికి
యూరప్ దేశాల్లో అమెరికన్ పెట్టుబడులను పరిమితం చేయడానికి
అమెరికాకు భారీగా లాభాలు తెచ్చే సేవల రంగాల్లో ఈయూ మార్కెట్లోకి అమెరికా కంపెనీలకు ప్రవేశాన్ని నిలిపివేయడానికి ట్రేడ్ బజూకా ఒక ఆయుధంలా ఈయూకు ఉపయోగపడుతుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన విభేదాలు/తగాదాలు వస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆ తగువును తీరుస్తుంది. ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. దానికన్నా వేగంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని ఈ ‘ట్రేడ్ బజూకా’ యూరప్ దేశాలకు కల్పిస్తుంది.
ఏం చేద్దాం?
ట్రంప్ సుంకాల రంకెల నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఈయూ నేతలు గురువారం బ్రసెల్స్‌లో అత్యవసర శిఖరాగ్ర సమావేశ నిర్వహణకు సిద్ధమయ్యారు. ట్రంప్ తమపై విధించిన సుంకాలకు బదులుగా.. అమెరికా ఉత్పత్తులపై 9300 కోట్ల యూరోల (దాదాపు రూ.9.78 లక్షల కోట్ల) సుంకాలు విధించాలని ఈయూ దేశాలు గతంలోనే నిర్ణయించాయి. సుంకాల యుద్ధాన్ని నివారించడానికి ఆ నిర్ణయం అమలు ను ఈయూ ఆర్నెళ్లు వాయిదా వేసింది. గురువారం జరిగే భేటీలో ఎక్కువ దేశాలు ఈ టారి్‌ఫ ల ప్యాకేజీ అమలుకు ఆమోదం తెలిపితే ఫిబ్రవరి 6 నుంచి ఆ సుంకాలు అమల్లోకి రావొచ్చు.