Share News

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా రక్షణ మంత్రి రాజీనామా

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:47 AM

భారతదేశానికి చెందిన ఒక కంపెనీతో కుదుర్చుకున్న రూ.769కోట్ల ఆయుధ ఒప్పందం వివాదాస్పదం కావడంతో.. ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కూర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా రక్షణ మంత్రి రాజీనామా

  • రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఆయుధాలు కొనివ్వాలని నిర్ణయించిన ఎస్తోనియా

  • ఇటలీలోని ‘డేటాసెల్‌’తో రూ.769 కోట్ల ఒప్పందం

  • అప్పటికే ఆ కంపెనీని కొన్న నాగపూర్‌కు చెందిన సంస్థ

  • నాణ్యత లేని సరుకు పంపడంతో కాంట్రాక్టు రద్దు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: భారతదేశానికి చెందిన ఒక కంపెనీతో కుదుర్చుకున్న రూ.769కోట్ల ఆయుధ ఒప్పందం వివాదాస్పదం కావడంతో.. ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కూర్‌ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో ఎన్నడూ ఆర్టిలరీ షెల్స్‌ తయారుచేయని సంస్థతో ఇంత పెద్ద డీల్‌ ఎలా కుదుర్చుకుంటారంటూ ఎస్తోనియా నేషనల్‌ ఆడిట్‌ కార్యాలయం ప్రశ్నించడంతో నైతికబాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రిజైన్‌ చేశారు. ఎస్తోనియా.. రష్యాను ఆనుకుని ఉన్న చిన్న దేశం. రష్యా దాడితో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఆర్టిలరీ షెల్స్‌ కొనిచ్చి, సహాయం చేయాలని ఎస్తోనియా భావించింది. ఆ ఆర్టిలరీ షెల్స్‌ను తయారుచేసిచ్చే కాంట్రాక్టును ఇటలీకి చెందిన ‘డేటాసెల్‌ ఎస్‌ఆర్‌ఎల్‌’ అనే కంపెనీకి ఇచ్చింది. ఈ మేరకు ఎస్తోనియా రక్షణ పెట్టుబడుల కేంద్రానికి డేటాసెల్‌ ఎస్‌ఆర్‌ఎల్‌ కంపెనీకి మధ్య 2024లో ఒప్పందం కుదిరింది. డేటాసెల్‌ కంపెనీ ఇటలీలో నమోదైన కంపెనీనే అయినప్పటికీ.. ఈ ఒప్పందం కుదిరేనాటికి దాన్ని భారత్‌కు చెందిన ‘నెకో డిఫెన్స్‌ మ్యూనిషన్స్‌’ అనే సంస్థ కొనుగోలు చేసింది. డేటాసెల్‌ కంపెనీయేమో ఐటీ సేవలు, కన్సల్టింగ్‌, టెలికం, జనరల్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన సేవలు అందించేది. దానికి స్వయంగా ఆర్టిలరీ షెల్స్‌, ఆయుధాలను తయారు చేసే ప్లాంట్లుగానీ, రక్షణ రంగ సాంకేతిక నైపుణ్యంగానీ లేనే లేవు. ఇక ఆ కంపెనీని కొనుగోలు చేసిన నెకో డిఫెన్స్‌ విషయానికి వస్తే.. అది నాగపూర్‌కు చెందిన జయస్వాల్‌ నెకో గ్రూప్‌ ప్రమోటర్లకు చెందిన సంస్థ. జయస్వాల్‌ నెకో ప్రధానంగా ఉక్కు, ఐరన్‌కాస్టింగ్స్‌, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులను తయారుచేస్తుంది. భారత ప్రభుత్వం ప్రైవేటు రంగంలో రక్షణ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఆ గ్రూపు ప్రమోటర్లు (జయస్వాల్‌ కుటుంబం).. ‘నెకో డిఫెన్స్‌ మ్యూనిషన్స్‌’ పేరిట రక్షణ రంగంలోకి ప్రవేశించారు. చిన్నస్థాయి ఆయుధాల తయారీకి అవసరమైన కాస్టింగ్స్‌ తయారుచేసిన అనుభవం తప్ప.. పెద్దస్థాయిలో ఒక యుద్ధంలో ఉపయోగించే ఆర్టిలరీ షెల్స్‌ను తయారుచేసిన అనుభవం ఈ కంపెనీకి లేదు. అలాంటి కంపెనీకి ఈ డీల్‌ ఇవ్వడం... అందునా ముందస్తు చెల్లింపులు చేసేయడం.. చెల్లించిన డబ్బును ‘యూరోపియన్‌ పీస్‌ ఫెసిలిటీ’ అనే ప్రత్యేక నిధి నుంచి తీసి ఇవ్వడం.. డేటాసెల్‌ కంపెనీ ముందుగా ఒప్పుకొన్న సమయానికి కాకుండా, చాలా ఆలస్యంగా, నాణ్యత లేని నాసిరకం షెల్స్‌ను సరఫరా చేయడం.. తీవ్ర దుమారం రేపింది.


లెక్కల్లో తేడా..

డేటాసెల్‌ కంపెనీ సరఫరా చేసిన ఆర్టిలరీ షెల్స్‌ నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఎస్తోనియా ఈ డీల్‌ను రద్దు చేయడమే కాక.. ముందుగా చెల్లించిన రూ.769కోట్లను తిరిగి తమకు చెల్లించాలని గతేడాది చివర్లోనే డిమాండ్‌ చేసింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. పలుదఫాలుగా డేటాసెల్‌ కంపెనీకి తాము 70మిలియన్‌ యూరోలు (రూ.769 కోట్లు) ఇచ్చినట్టు ఎస్తోనియా చెబుతుండగా, తమకు ముట్టింది 59 మిలియన్‌ యూరోలేనని, అందులో 58 మిలియన్‌ యూరోలకు సరిపడా సరుకు సరఫరా చేసి, ఇన్వాయి్‌సలు కూడా ఇచ్చామని డేటా సెల్‌ చెబుతోంది. డేటాసెల్‌కు ఇచ్చింది 59 మిలియన్‌ యూరోలే అయితే.. మిగిలిన 11 మిలియన్‌ యూరోలు ఎక్కడికి పోయాయంటూ ఎస్తోనియా ప్రజలు, విపక్షాలు, మీడియా నిలదీస్తుండడంతో ఎస్తోనియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. దీనిపై ఎస్తోనియా నేషనల్‌ ఆడిట్‌ కార్యాలయం విచారణ జరిపి ఆగస్టు 28వ తేదీన తుది నివేదిక ఇచ్చింది. ఈ డీల్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని, లెక్కల్లో లోపాలున్నాయని తేల్చింది. ఈయూ పీస్‌ ఫెసిలిటీ నుంచి తీసి డేటాసెల్‌ కంపెనీకి ఇచ్చిన సొమ్మును రికవరీ చేయకపోతే.. ఆ డబ్బును దేశ ఖజానా నుంచి తీసి చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. దీంతో ఎస్తోనియా రక్షణ మంత్రి.. రాజకీయ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఎస్తోనియాకు తాము ఇప్పటికే 58 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.636కోట్లు) విలువైన మ్యూనిషన్స్‌ సరఫరా చేశామని.. ఆ తర్వాత ఆ దేశం తమతో డీల్‌ను ఏకపక్షంగా రద్దు చేసుకుందని డేటాసెల్‌ వాదిస్తోంది. ఒప్పందం రద్దును సవాల్‌ చేస్తూ ఫ్రాన్స్‌లోని యూరోపియన్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ను ఆశ్రయించింది. ఆర్టిలరీ షెల్స్‌ సరఫరా ఆలస్యమైన మాట నిజమేగానీ.. నాణ్యతకు ఢోకా లేదని.. ఈ డీల్‌ వల్ల నష్టపోయింది తామేనని ఆ సంస్థ వాదిస్తోంది. ఎస్తోనియా కూడా డబ్బు రికవరీ కోసం అదే మధ్యవర్తిత్వ కేంద్రానికి వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ విచారణలో ఉంది.

Updated Date - Sep 05 , 2026 | 04:48 AM