ఆగని దాడులు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:06 AM
ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింతగా ముదురుతోంది....
ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింతగా ముదురుతోంది. పలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు తమవైపు దూసుకువచ్చాయని బహ్రెయిన్ వెల్లడించింది. రాజధాని మనామాలోని ఒక నివాస భవనంపై డ్రోన్ దాడి జరిగిందని, ఒక మహిళ మృతిచెందగా, 8 మంది గాయపడ్డారని తెలిపింది. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న తమ దౌత్యకార్యాలయంపై డ్రోన్ దాడి జరిగినట్టు యూఏఈ వెల్లడించింది. తమ దేశంలోని రువైస్ నగరంలో పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగి మంటలు వ్యాపించినట్టు తెలిపింది. తమ దేశాల్లోని చమురు రిఫైనరీల వైపు వచ్చిన పలు ఇరాన్ డ్రోన్లను కూల్చివేశావనిఇ సౌదీ అరేబియా, కువైట్ వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్‌లోని జెరుసలేం, టెల్ అవీవ్‌లలో పలు పేలుళ్లు జరిగాయి. ఇరాన్‌కు కాల్పుల విరమణ ఆలోచనేదీ లేదని, మరోసారి ఇరాన్ జోలికిరాకుండా శత్రువులను గట్టి దెబ్బతీస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘర్ ఖలీబఫ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మృతుల సంఖ్య 570కు, క్షతగాత్రుల సంఖ్య 1,444కు పెరిగిందని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
ఉధృతంగా దాడులు చేపడతాం: అమెరికా
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విస్తృతంగా వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్‌పై ఇప్పటివరకు లేనంత ఉధృతంగా దాడి చేయనున్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం ప్రకటించారు. ఇరాన్ లాంచర్లను దెబ్బతీయడంతో.. ఆ దేశం ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పారు. ఇరాన్‌లోని 5 వేల లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. చమురు సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక పెట్రోల్, డీజిల్ ధరలను 8 శాతం పెంచింది.