Share News

దద్దరిల్లిన ఇరాన్‌, ఇజ్రాయెల్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:25 AM

దాడులకు కొన్ని రోజులు విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పేలుళ్లతో దద్దరిల్లాయి.

దద్దరిల్లిన ఇరాన్‌, ఇజ్రాయెల్‌!

  • మరింత ఉధృతంగా పరస్పర దాడులు.. ఇరాన్‌లోని బుషెహర్‌ అణుప్లాంటుపై దాడి

  • టెహ్రాన్‌లో నిరంతరాయంగా పేలుళ్లు

  • భారీగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్‌

వాషింగ్టన్‌/దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 25: దాడులకు కొన్ని రోజులు విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పేలుళ్లతో దద్దరిల్లాయి. పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు ఇతర ప్రాంతాలపై ఇప్పటివరకు ఏకంగా 15 వేల బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ ఇతర నగరాలపై ఇరాన్‌ క్లస్టర్‌ వార్‌హెడ్‌ ఉన్న క్షిపణులతో విరుచుకుపడింది. అదే సమయంలో పశ్చిమాసియాలోని లక్ష్యాలపైనా దాడులు చేసింది. కువై ట్‌ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులుపేలిపోయి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా 82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌కు చెందిన వెయ్యి మంది సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తున్నట్టు అమెరికా రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం ప్రచురించింది. ఇరాన్‌తో కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్న క్రమంలో బలగాల తరలింపు చర్చనీయాంశంగా మారింది.

కువైట్‌ విమానాశ్రయంలో అలజడి

  • కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్‌ డ్రోన్ల దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. ఇంధన ట్యాంకులు అంటుకుని భారీగా అగ్నికీలకలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలతో ఆ ప్రాంతం నిండిపోయింది. విమానాశ్రయం పరిధిలో నాలుగు చోట్ల మంటలు అంటుకున్నాయని.. వాటిని ఆర్పేందుకు చర్యలు చేపట్టామని కువైట్‌ నేషనల్‌ గార్డ్‌ ప్రతినిధి మొహమ్మద్‌ అల్‌ ఘరీబ్‌ వెల్లడించారు. ఇరాన్‌ దాడులలో ఇప్పటివరకు ఇలాంటి 82 ఘటనలు జరిగాయని తెలిపారు. కాగా, ఈ దాడిని కువైట్‌ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

  • ఇరాన్‌ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లోని నెతన్యా పట్టణంలో విద్యుత్‌ వ్యవస్థలు ధ్వంసమై అంధకారంలో మునిగిపోయింది. ఇలాత్‌ నగరంలో పేలుళ్లు వినిపించాయి. మంగళవారం ఇరాన్‌ చేసిన దాడుల్లో 204 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్‌ తెలిపింది.

  • బుధవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఆయుధాల ఫ్యాక్టరీని, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైల్‌ లాంఛర్‌ను, పలు మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మొత్తం ఇరాన్‌పై ఇప్పటివరకు 15 వేల బాంబులు వేసినట్టు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ ప్రకటించారు. ఇక ముందూ దాడులు కొనసాగించనున్నట్టు తెలిపారు.

  • టెహ్రాన్‌లో సహాయక చర్యల్లో ఉన్న బృందంపై ఇజ్రాయెల్‌ బాంబుదాడి చేసిందని ఇరాన్‌కు చెందిన టాస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది.

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఉధృతంగా కొనసాగాయి. తమ దేశంలో బుధవారం 22 మరణించారని, దానితో మృతల సంఖ్య 1,094 మందికి పెరిగిందని.. 3,119 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • బుధవారం ఒక క్షిపణి, 30 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా తెలిపింది.


బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రంపై మరోదాడి!

ఇరాన్‌లోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రంపై మరోసారి దాడి జరిగింది. మంగళవారం రాత్రి ప్లాంటులోని ప్రధాన అణు రియాక్టర్‌కు అతి సమీపంలో దాడి జరిగిందని.. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని ఇరాన్‌ ప్రకటించింది. ఈ వివరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు అందజేసింది. దీనిపై సమీక్షించిన ఐఏఈఏ.. బుషెహర్‌ ప్లాంటుపై దాడి జరిగిందని నిర్ధారించింది. అయితే ప్లాంటుకు ప్రమాదమేమీ లేదని, అణుధార్మికత లీక్‌ కావడం లేదని ప్రకటించింది.

అమెరికా ఎఫ్‌/ఏ-18ను కూల్చేశాం: ఐఆర్‌జీసీ

అమెరికాకు చెందిన ఎఫ్‌/ఏ-18 ఫైటర్‌ను కూల్చేశామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) బుధవారం ప్రకటించింది. దాడిలో దెబ్బతిన్న విమానం సముద్రంలో కూలిపోయినట్టు పేర్కొంది. ఇరాన్‌ దేశీయ రక్షణ వ్యవస్థలతో విజయవంతంగా కూల్చిన నాలుగో శత్రు యుద్ధ విమానం ఇదని తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక టీవీ చానల్‌ ప్రెస్‌ టీవీ ఒక వీడియోను విడుదల చేసింది. దూసుకెళుతున్న ఫైటర్‌ విమానాన్ని ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ఢీకొన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకున్న 2,000 నౌకలు

హోర్ముజ్‌ జలసంధి మూసివేత కారణంగా పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో 2 వేల వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయని, వాటిలో 20 వేల మందికిపైగా సిబ్బంది ఉన్నారని అంతర్జాతీయ జలరవాణా సంస్థ (ఐఎంఓ) బుధవారం ప్రకటించింది. సుమారు నెల రోజులుగా నౌకల్లోనే ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఐఎంఓ సెక్రెటరీ జనరల్‌ ఆర్సెనియో డొమిన్‌గ్వెజ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోని నౌకల రక్షణకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని చెప్పారు.

అబ్రహం లింకన్‌ యుద్ధనౌకపైకి క్షిపణులు

అమెరికా విమాన వాహక యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది. ఆ క్షిపణులు నౌకకు తగిలి నష్టం కలిగించాయని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక టీవీ చానల్‌ ప్రెస్‌ టీవీ కథనం ప్రసారం చేసింది. అబ్రహం లింకన్‌ నౌక తమ నిఘా పరిధిలోకి వచ్చిందని, అది ఇరాన్‌ ప్రాదేశిక జలాలకు సమీపంగా వస్తే దాడి చేస్తామని ఇరాన్‌ నేవీ కమాండర్‌ షహ్రామ్‌ ఇరానీ అంతకుముందే హెచ్చరించడం గమనార్హం. అయితే ఇరాన్‌ క్షిపణుల ప్రయోగం గురించిగానీ, లింకన్‌ నౌకకు ఏదైనా నష్టం జరిగిందా అనే అంశంపైగానీ అమెరికా నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

Updated Date - Mar 26 , 2026 | 04:26 AM