యూరప్‌లో ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:41 AM
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు అమెరికాను దాటి పలు యూరప్ దేశాల రాజకీయ, దౌత్య వర్గాలతోపాటు యూకే రాజకుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి..
పలు దేశాల్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా
అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో లింకులు
బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు
స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్‌స్వీనే రాజీనామా
పదవి వీడే ఆలోచన లేదన్న ప్రధాని కీర్ స్టార్మర్
మాండెల్సన్ నియామకంపై విచారం
పుతిన్‌తో భేటీకి ఎప్‌స్టీన్ యత్నం?
లండన్/పారిస్/ఓస్లో, ఫిబ్రవరి 9: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు అమెరికాను దాటి పలు యూరప్ దేశాల రాజకీయ, దౌత్య వర్గాలతోపాటు యూకే రాజకుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి! బ్రిటన్‌లో సాక్షాత్తూ ప్రధాన మంత్రి పీఠమే కదులుతుండగా.. నార్వే, స్వీడన్, స్లొవేకియా, ఫ్రాన్స్ వంటి దాదాపు 10 దేశాల్లో ఈ ఫైల్స్ కారణంగా పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు బట్టబయలైన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాండెల్సన్ గురించి తెలిసి కూడా 2024లో ఆయన్ను బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని రాజకీయ నాయకులు తప్పుపడుతున్నారు. మాండెల్సన్‌కు, ఎప్‌స్టీన్‌తో ఉన్న స్నేహం గురించి ఈమెయిల్స్ ద్వారా వెల్లడవడంతో గత సెప్టెంబరులో స్టార్మర్ ఆయన్ను పదవి నుంచి తప్పించారు. 15 ఏళ్ల క్రితం మాండెల్సన్ బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు చేరవేశారన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగడంతో ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని తన పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు స్టార్మర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న మోర్గాన్ మెక్‌స్వీనే ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. మాండెల్సన్‌ను నియమించాలన్న సలహా ప్రధానికి తానే ఇచ్చానని, దానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టార్మర్ సోమవారం అధికార లేబర్ పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేశారు. మాండెల్సన్ నియామకంపై విచారం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మోర్గాన్ మెక్‌స్వీనేకు వీడ్కోలు తెలిపారు. ఎనిమిదేళ్లుగా ఆయన తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడని పేర్కొన్నారు. ఇక ఎప్‌స్టీన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై ఆ దేశ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద విచారణ ప్రారంభించారు. 2001 నుంచి 2011 దాకా బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, తన అధికారిక పర్యటనలకు సంబంధించిన అతి రహస్య నివేదికలు, పెట్టుబడుల అవకాశాల గురించి ఎప్‌స్టీన్‌కు పంపినట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. మరోవైపు నార్వేకు చెందిన రాయబారి మోనా జూల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు తేలడంతో జోర్డాన్‌లో నార్వే రాయబారిగా ఉన్న ఆమెను ఇటీవల సస్పెండ్ చేశారు. ఆదివారం ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లు నార్వే విదేశాంగ శాఖ తెలిపింది. స్లొవేకియా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజక్, స్వీడన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్‌స్టీన్‌లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎప్‌స్టీన్‌తో వీరికి ఉన్న సంబంధాలపై విచారణ ప్రారంభించారు.