Share News

స్టార్‌లింక్‌ రాకతో అంబానీ ఆదాయం తగ్గొచ్చు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:31 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకొని ‘స్పేస్‌ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మాస్క్‌ తన దాడిని కొనసాగిస్తున్నారు. తన శాటిలైట్‌ ప్రొవైడర్‌ రాకతో..

స్టార్‌లింక్‌ రాకతో అంబానీ ఆదాయం తగ్గొచ్చు

  • కానీ వ్యాపారం మాత్రం మూతపడదు

  • సగటు భారత పౌరుడికి ప్రయోజనం

  • అంబానీ మద్దతుదారుల వాదన అర్థరహితం

  • రిలయన్స్‌పై కొనసాగుతున్న మస్క్‌ దాడి

న్యూఢిల్లీ, అక్టోబరు 11: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని లక్ష్యంగా చేసుకొని ‘స్పేస్‌ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మాస్క్‌ తన దాడిని కొనసాగిస్తున్నారు. తన శాటిలైట్‌ ప్రొవైడర్‌ రాకతో భారత్‌లో పోటీ పెరిగి సగటు పౌరుడు ప్రయోజనం పొందుతాడని ఆదివారం ‘ఎక్స్‌’లో ఆయన పేర్కొన్నారు. అంబానీ మద్దతుదారులు హాస్యాస్పద కపటత్వం, అతిశయోక్తులతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ ఆగమనం అంబానీ లాభాలను తగ్గించవచ్చని, కానీ ఆయన వ్యాపారానికి తాము ఎలాంటి ముప్పూ కలిగించబోదన్నారు. స్టార్‌లింక్‌ సేవలు మరీ ఖరైదనవిగా అనిపిస్తే ప్రజలే సబ్‌స్ర్కైబ్‌ చేసుకోరని.. దాంతో స్పేస్‌ఎక్స్‌ కూడా సరసమైన ధరలకు సేవలందించక తప్పదని తెలిపారు. అంబానీ మద్దతుదారుల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని కొట్టిపారేశారు. ‘ఓపక్క భారత్‌లో అంబానీ గుత్తాధిపత్య సామ్రాజ్యం అందించే అత్యంత తక్కువ ధరలతో స్టార్‌లింక్‌ ఏమాత్రం పోటీపడలేదని వారే అంటారు. మళ్లీ వారే స్టార్‌లింక్‌ చాలా బలమైన పోటీదారు అని చెబుతారు’ అని మస్క్‌ వ్యాఖ్యానించారు. భారత టెలికాం రంగంలో రిలయన్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో.. స్టార్‌లింక్‌ రాకుండా అంబానీ అడ్డుకుంటున్నారని మస్క్‌ వారం రోజులుగా ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.


స్టార్‌లింక్‌తో భారత భద్రతకు ముప్పు: దూబే

భారత కమ్యూనికేషన్ల రంగంలోకి స్టార్‌లింక్‌ ప్రవేశం దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని కమ్యూనికేషన్లు, ఐటీ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే స్పష్టంచేశారు. ఎలాన్‌ మాస్క్‌ తీరుపై దూబే మండిపడ్డారు. భారత్‌ ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశమని.. సోషల్‌ మీడియా, ఒత్తిళ్లతో తన భద్రతా విధానాన్ని మార్చుకోదని ఆదివారం ‘ఎక్స్‌’లో స్పష్టం చేశారు. స్టార్‌లింక్‌తో వల్ల పొంచి ఉన్న ప్రమాదాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 04:34 AM