Share News

అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్‌ షేర్లు

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:13 AM

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. అమెరికాలోని ప్రతి చిన్నారికి తమ స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన రెండు షేర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అందులో ఒక షేరును సంస్థ నుంచి అందించనుండగా..

అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్‌ షేర్లు

  • సంస్థ నుంచి ఒక షేరు, వ్యక్తిగతంగా మరో షేరు

  • విరాళంగా ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌

  • ప్రస్తుత విలువ ప్రకారం ఒక్కో చిన్నారికి రూ.23,600

  • దీర్ఘకాలం ఉంచుకోండి.. పిల్లలకు ఎలాన్‌ మస్క్‌ సూచన

వాషింగ్టన్‌, నవంబరు 26: ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. అమెరికాలోని ప్రతి చిన్నారికి తమ స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన రెండు షేర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అందులో ఒక షేరును సంస్థ నుంచి అందించనుండగా, మరో షేరును సంస్థలోని తన వ్యక్తిగత వాటా నుంచి అందించనున్నట్టు తెలిపారు. నిజానికి అమెరికాలో చిన్నారులందరికీ ఒక్కో స్పేస్‌ ఎక్స్‌ షేరు ఇస్తామని మస్క్‌ గతం నెలలోనే ప్రకటించారు. ఇప్పుడు రెండు షేర్ల చొప్పున ఇస్తామని గురువారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో సంస్థ విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని, షేర్లను దీర్ఘకాలం ఉంచుకోవాలని చిన్నారులకు సూచించారు. అమెరికా చిన్నారులకు దీర్ఘకాలికంగా సంపదను సమకూర్చే లక్ష్యంతో రూపొందించిన ’ట్రంప్‌ అకౌంట్స్‌‘ పథకంలో భాగంగా ఈ షేర్ల పంపిణీ జరగనుంది. సంస్థ నుంచి ఇచ్చే షేరును ఈ ఏడాది డిసెంబరులో, మస్క్‌ వ్యక్తిగతంగా ఇచ్చే షేరును వచ్చే ఏడాది జూన్‌లో ట్రంప్‌ అకౌంట్స్‌లో జమ చేయనున్నట్టు స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.


పిల్లల భవిష్యత్తుకు భరోసా.. ‘ట్రంప్‌ అకౌంట్స్‌’

అమెరికాలో 18 ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించిన పన్ను ప్రయోజనాలు ఉండే పెట్టుబడి ఖాతాలే ‘ట్రంప్‌ అకౌంట్స్‌’. వీటి ద్వారా పిల్లలకు చిన్న వయసు నుంచే దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడి అలవాట్లు కల్పించడం, సంస్థలు, వ్యక్తుల నుంచి పిల్లలకు నేరుగా దాతృత్వ సాయం అందించాలన్నది లక్ష్యం. సదరు పిల్లల కుటుంబ సభ్యులు గరిష్ఠంగా ఏడాదికి 5వేల డాలర్ల వరకు ఈ ఖాతాల్లో జమ చేయవచ్చు. సంస్థలు, వ్యక్తులు ఎంతైనా ఆర్థిక సాయం చేయవచ్చు. ఈ సొమ్ముకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ‘ట్రంప్‌ అకౌంట్ల’లో రూ.83 వేల కోట్ల (9బిలియన్‌ డాలర్ల)కుపైగా నిధులు జమ అయినట్లు అంచనా. అయితే ట్రంప్‌ ప్రభుత్వం ఏడు కోట్ల మంది పిల్లల పేరిట ఖాతాలు సృష్టించినా.. ఇంకా చాలా మంది వాటిని ధ్రువీకరించి, క్రియాశీలకం చేసుకోలేదు. ఇటీవలే డెల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ డెల్‌.. తాను, తన భార్య సుసాన్‌ డెల్‌ కలిసి పదేళ్లలోపు వయసున్న 2.5 కోట్ల మంది అమెరికా చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.23 వేల (250 డాలర్ల) చొప్పున సుమారు రూ.58 వేల కోట్ల (6.25 బిలియన్‌ డాలర్లు) సాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఆ సొమ్మును ట్రంప్‌ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. అయితే ఈ ఖాతాల్లో 90శాతానికి పైగా ఖాతాలు ఇంకా క్రియాశీలకంగా మారలేదని గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో పిల్లలకు స్పేస్‌ఎక్స్‌ షేర్ల పంపిణీని ట్రంప్‌ అకౌంట్స్‌ యాక్టివ్‌గా ఉన్న చిన్నారులకే వర్తింపజేస్తారా, అందరికీ ఇస్తారా? అన్న స్పష్టత రావాల్సి ఉంది.


అమెరికా సంపన్నుల దాతృత్వం.. వేల కోట్లు

  • అమెరికాలో విద్య, వైద్యం, క్యాన్సర్‌ పరిశోధన, మహిళా సాధికారత, చిన్నారుల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ.. ఇలా అనేక రంగాలకు అక్కడి సంపన్నులు భారీగా విరాళాలు ఇస్తుంటారు. వారెన్‌ బఫెట్‌, బిల్‌ క్లింటన్‌ వంటివారు వివిధ ఫౌండేషన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య, రచయిత్రి మాకెంజీ స్కాట్‌ 2021లో పేదరిక నిర్మూలన, విద్య, జాతి సమానత్వం, మహిళా అభివృద్ధి, కళలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పనిచేసే 286 స్వచ్ఛంద సంస్థలకు రూ.19 వేల కోట్లు (2.7 బిలియన్‌ డాలర్లు) విరాళంగా ఇచ్చారు. అదే ఏడాది బ్యాంకింగ్‌ రంగ వ్యాపారవేత్త డెన్నీ శాన్‌ఫోర్డ్‌ వైద్యులు శిక్షణ, గ్రామీణ ఆరోగ్య సేవల కోసం రూ.6 వేల కోట్లు విరాళంగా అందజేశారు.

  • ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు జాన్‌ డోయర్‌ 2022లో స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీకి రూ.9,300కోట్లు ఇచ్చారు.

  • బ్లూమ్‌బర్గ్‌ సంస్థ వ్యవస్థాపకుడు మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ వైద్యవిద్య కోర్సులు చేసేవారి కోసం 2024లో జాన్‌హాప్కిన్స్‌ వర్సిటీకి రూ.9.3 వేల కోట్లు అందజేశారు. 2026లోనూ వివిధ సంస్థలకు రూ.37వేలకోట్ల విరాళాలు ప్రకటించారు.

  • నైక్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఫిల్‌ నైట్‌, ఆయన భార్య పెన్నీ నైట్‌ క్యాన్సర్‌కు కొత్త చికిత్సల అభివృద్ధి, రోగులకు మెరుగైన సేవల కోసం గత ఏడాది ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయానికి రూ.18.6 వేల కోట్లను అందజేశారు.

  • అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తల్లి జాక్లిన్‌ చైల్డ్‌ న్యూట్రిషన్‌ ఫండ్‌కు రూ.4,700 కోట్లు ఇచ్చారు.

  • సిటాడెల్‌ సంస్థ వ్యవస్థాపకుడు కెన్‌ గ్రిఫిన్‌ కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయానికి రూ.18.6 వేల కోట్లు విరాళం ప్రకటించారు.


ఒక్కో చిన్నారికి రూ.23,600.. మొత్తం రూ.1.64 లక్షల కోట్లు

ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ ఒక్కో షేరు విలువ రూ.11,800 (127.5డాలర్లు) వద్ద ఉంది. అంటే ఒక్కో చిన్నారికి రూ.23,600 (255 డాలర్లు) విలువైన షేర్లు అందుతాయి. అమెరికాలోని 7 కోట్ల మంది పిల్లలకు రెండు చొప్పున షేర్లను అందజేస్తే.. ఆ 14 కోట్ల షేర్ల విలువ సుమారు రూ.1.64 లక్షల కోట్లు అవుతుండటం గమనార్హం. ఇక స్పేస్‌ఎక్స్‌ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ షాట్‌వెల్‌ కూడా వ్యక్తిగతంగా 20 లక్షలకుపైగా షేర్లను చిన్నారుల ఖాతాల్లో విరాళంగా జమచేయనున్నట్టు ప్రకటించారు.

Updated Date - Nov 27 , 2026 | 04:28 AM