దుబాయిలో బతుకమ్మ చందాల దందా!
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:42 AM
దుబాయిలో బతుకమ్మ పండుగ పేరిట చందాల వసూళ్ల దందా మొదలైంది. తెలంగాణ ప్రవాసీయులు కొంత మంది ఫలానా నాయకులమంటూ..
నాయకుల పేరిట వసూళ్లు..
పోటాపోటీగా ఉత్సవాల ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయిలో బతుకమ్మ పండుగ పేరిట చందాల వసూళ్ల దందా మొదలైంది. తెలంగాణ ప్రవాసీయులు కొంత మంది ఫలానా నాయకులమంటూ.. బతుకమ్మ పండుగను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామంటూ అనేక మంది తెలంగాణ ప్రముఖులను కలిసి బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ చందాలు వసూళ్లు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత మంది చందారాయుళ్ల అవతారం ఎత్తారు. ప్రస్తుతం వారంతా ఇదే దందాలో తలమునకలయ్యారు.
గతేడాది ఓ పార్టీ బతుకమ్మ అంటూ తిరిగిన వారు.. ఈసారి మరో పార్టీ పేరుతో బరిలోకి దిగారు. చందాలకు తోడు తమకు అసోసియేషన్లలో పదవీ యోగం కల్పించాలంటూ వర్గాలు గా విడిపోయి మరీ ప్రముఖుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరో వైపు ఉత్సవాలకు పోటాపోటీగా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తున్న ప్రవాసీయులు.. చందాల సహకారం అందించాలని కోరుతూ.. దుబాయిలో బతుకమ్మ ఉత్సవాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు.